పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజల సంక్షేమం పెంపొందించడమే ధ్యేయంగా తాజాగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రతను కాపాడటంతో పాటు సామాన్యులకు ఆర్థిక భరోసా కల్పించేలా అనేక నూతన నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పాఠశాలలు, కాలేజీలు, దేవాలయాలకు ఒక కిలోమీటర్ పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సువేందు అధికారి పేర్కొన్నారు.
మహిళా సాధికారత కోసం బెంగాల్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్నపూర్ణ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.3,000 చొప్పున నేరుగా ఆర్థిక సాయం అందించనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాల పంపిణీ ప్రక్రియ మే 27 నుంచే ప్రారంభం కానుంది. రాష్ట్ర సచివాలయం నుంచి ఈ ఫారాలను జారీ చేస్తారు. భారతీయ పౌరులైన మహిళలందరూ ఈ పథకానికి అర్హులని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ప్రతి నెలా స్థిరమైన ఆర్థిక వనరు లభించనుంది.
అలాగే పేద మధ్య తరగతి వర్గాల ఆకలి తీర్చడానికి కేవలం రూ.5 లకే చేపల అన్నం అందించే సరికొత్త సబ్సిడీ క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేసి నాణ్యమైన భోజనాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనితో పాటు వైద్య రంగంలో సంస్కరణలు ప్రవేశపెడుతూ ఇప్పటివరకు ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ఆయుష్ విభాగాన్ని వేరు చేసి ప్రత్యేకంగా ఒక నూతన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సువేందు ప్రకటించారు.
