కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య వైసీపీలో లాంఛనంగా చేరారు. విజయనగరంలో పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ కండువా కప్పి సాదరనంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీపై నిప్పులు చెరిగారు.
సి. రామచంద్రయ్య తొలుత టీడీపీలో ఉండేవారు.పీఆర్పీ ఏర్పాటు తర్వాత టీడీపీని వీడి ఆయన పీఆర్పీలో చేరారు. పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
ఏపీలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఎగురుతున్నారని ఎద్దేవా చేశారు. రామారావుతోనే టీడీపీ పార్టీ పోయిందని ఇప్పుడున్న ది హైబ్రిడ్ పార్టీ అని ఎద్దేవ చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిన చంద్రబాబు గవర్నర్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పక్కా అవకాశవాదని విమర్శించారు. చంద్రబాబు చేసిన పాపాల నుంచి రక్షించాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తమను సంప్రదించకుండానే టీడీపీతో పొత్తు పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి చాలా మంది బయటకు వస్తారని జోష్యం చెప్పారు.
