అగ్ర హీరోలూ ఈ సారైనా వెండితెరపై దర్శనమిస్తారా?

- Advertisement -

ఒకప్పుడు సంక్రాంతి, ఉగాది, దసరా, సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు అగ్ర హీరోలు నటించిన సినిమాలు తెరపైకి క్యూ కట్టేవి. అభిమానుల సందడితో థియేటర్లు కిక్కిరిసిపోయేవి. ఇక అగ్ర హీరోల సినిమాలు పోటాపోటీగా విడుదల అయితే ఆ సందడే వేరు. ఇప్పుడు ఆ కాలం లేదు. ఇద్దరు అగ్ర హీరోలు పోటీపడడం కాదు కదా.. కనీసం ఒక్క అగ్రహీరో నటించిన సినిమా కూడా విడుదల కావడం లేదు. దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ పరిస్థితికి కారణం కరోనా మహమ్మారే.

ఏడాదిన్నరగా కోవిడ్ కారణంగా థియేటర్లలో సినిమాలు విడుదల గగనమైంది. కనీసం చిన్న హీరోలు నటిస్తున్న సినిమాలు ఓటీటీ వేదికల్లో అయినా విడుదల అవుతున్నాయి. కానీ అగ్ర హీరోలు నటించిన సినిమాలు షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ ఏడాది ఒకే ఒక్క అగ్రహీరో నటించిన సినిమా విడుదలైంది. అదే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. గత ఏడాది మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో విడుదల అయ్యాయి. మిగతా అగ్ర హీరోల సినిమాలు రెండేళ్లుగా థియేటర్లలో విడుదల కాలేదు.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సినిమాలు విడుదల కాక రెండేళ్లు దాటిపోయింది. దీంతో వారి వారి అభిమానులు తమ హీరోలు నటించిన సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా.. అని ఎదురుచూస్తున్నారు. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన రెండో సినిమా సైరా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా 2019లో విడుదలవ్వగా, అప్పటి నుండి చిరంజీవి నటించిన మరో సినిమా తెరపైకి రాలేదు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. దసరా కానుకగా విడుదల అయ్యే అవకాశం ఉంది.

బాలకృష్ణ నటించిన చివరి సినిమా రూలర్. 2019లో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ఆయన నటించిన మరో సినిమా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ వినాయక చవితి కానుకగా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వెంకటేష్ కూడా 2019 లో వెంకీ మామ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన నటించిన నారప్ప, దృశ్యం -2 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఈ రెండు సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ పరిస్థితి మరోలా ఉంది. కరోనాకు ముందు నుంచి ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువగా విడుదల అవుతున్నాయి. బాహుబలి కోసం ఆయన ఐదేళ్ల సమయం కేటాయించగా, సాహో సినిమా కోసం మరో రెండేళ్లు కేటాయించారు. సాహో సినిమా 2019 లో విడుదలైంది. ఇప్పుడు రాధేశ్యామ్ కోసం కూడా ప్రభాస్ మరో రెండేళ్ల సమయం తీసుకున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ తుది షెడ్యూల్ నడుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.

ఇక ఎన్టీఆర్ తెరపై కనిపించి మూడేళ్ళు దాటింది. 2018లో ఆయన నటించిన అరవింద సమేత వీర రాఘవ విడుదలైంది. అప్పటి నుంచి ఆయన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ 2019 లో విడుదలైంది. చరణ్ కూడా ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇలా పలువురు అగ్ర హీరోలు నటించిన సినిమాలు థియేటర్లలో విడుదలై రెండేళ్లు దాటిపోయింది. వారి సినిమాలు మళ్లీ థియేటర్లో ఎప్పుడు విడుదల అవుతాయా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Also Read

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -