Saturday, April 20, 2024
- Advertisement -

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

- Advertisement -

ఒకప్పుడు గొప్ప సినిమాలు అంటే తమిళ, మలయాళ సినిమాలు గుర్తుకొచ్చేవి. అంటే తెలుగులో మంచి చిత్రాలు రాలేదా అంటే.. వచ్చాయి. ఒకప్పుడు ఇండియా గర్వించే సినిమాలు తెలుగు నేలపై తెరకెక్కాయి. ఆ తర్వాత కొన్నేళ్లు తమిళ సినిమాలు రీమేక్ చేసుకోవడం, తమిళ డైరెక్టర్లను అందలం ఎక్కించడం వంటి పనులతో మన స్థాయి మనమే దిగజార్చుకున్నాం. అయితే ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ ఓ వెలుగు వెలుగుతోంది. పాన్ ఇండియా స్థాయి సినిమాలకు టాలీవుడ్ వేదికగా మారింది. దేశంలోని అన్ని సినీఇండస్ట్రీలు ఇప్పుడు మన వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.

రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల పెట్టుబడితో సినిమాలు నిర్మించే స్థాయికి టాలీవుడ్ ఎదిగింది. రాజమౌళి, క్రిష్, గుణశేఖర్, నాగ్ అశ్విన్, కొరటాల శివ, సురేందర్ రెడ్డి, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా ఆ జాబితాలో చేరాడు. టాలీవుడ్ లో ఎప్పుడూ లేని విధంగా యువ దర్శకుల హవా మొదలైంది. తమ మొదటి సినిమాతోనే హిట్ కొడుతున్న దర్శకులు ఎందరో ఉన్నారు. కొత్త దర్శకులైన గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంటి వారు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నారు.

రామ్, అల్లు అర్జున్, బెల్లంకొండ శ్రీనివాస్, విజయ్ దేవరకొండ, నాని హీరోలుగా నటించిన సినిమాలు డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తే కోట్లకొద్దీ వ్యూస్ వస్తున్నాయి. పదుల సంఖ్యలో కొత్త హీరోలు పరిచయమై టాలీవుడ్ లో రాణిస్తున్నారు. తెలుగు లో తెరకెక్కుతున్న మాస్ సినిమాలను కూడా బాలీవుడ్ ప్రేక్షకులు వదల కుండా చూస్తున్నారు. ఇలా అన్నిటా టాలీవుడ్ వెలిగిపోతోంది. మన హీరోలు ఒకప్పటి బాలీవుడ్ హీరోల్లాగా దేశ వ్యాప్తంగా క్రేజ్ పెంచుకునే పనిలో ఉంటే కోలీవుడ్ హీరోలు సందట్లో సడేమియాలా టాలీవుడ్ లో తమ క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కోలీవుడ్ హీరోలకు మొదటి నుంచి తెలుగులో ఆదరణ ఎక్కువే. కమలహాసన్, రజినీకాంత్ తమ కెరీర్ ప్రారంభంలో తెలుగులో డైరెక్ట్ గా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ తర్వాత వారికి స్టార్డం వచ్చిన తర్వాత డైరెక్ట్ తెలుగు మూవీస్ లో నటించలేదు. కానీ వారు నటించిన ప్రతి తమిళ సినిమాను తెలుగులోకి డబ్ చేసి వదిలేవారు. వాటిని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించే వారు. నేటితరం తమిళ స్టార్ హీరోలకు కూడా తెలుగులో మంచి మార్కెట్ సంపాదించారు.

ముఖ్యంగా సూర్య, విక్రమ్, విజయ్, కార్తీ, విశాల్ వంటి హీరోలకు తెలుగు లో బ్లాక్ బాస్టర్ హిట్లు కూడా పడ్డాయి. వీరు తమ తమిళ సినిమా ప్రమోషన్ల కోసం టాలీవుడ్ కు వచ్చినప్పుడల్లా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలని ఉందని అనడం తప్ప.. ఎప్పుడూ చేసింది లేదు. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంతటి స్థాయి గల హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ తన కెరీర్ ఆరంభంలో టాలీవుడ్ లో తన మార్కెట్ పెంచుకునేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. కానీ తన సహచర హీరోలు సూర్య, విక్రమ్ వంటి వారు తెలుగులో మార్కెట్ పెంచుకోవడంతో క్రమంగా విజయ్ కూడా తన ప్లాన్ మార్చుకున్నాడు. ఇప్పుడు తన ప్రతి సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ హిట్లు కూడా కొడుతున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోలు అందరూ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. మన హీరోలు ఇతర ఇండస్ట్రీల్లో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు ఉండగా, మెల్లగా తమిళ హీరోలు టాలీవుడ్ లో పట్టుసాధించేందుకు, ఇక్కడ తమ క్రేజ్ పెంచుకునేందుకు ప్లాన్లు వేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, వారు నేరుగా తెలుగు సినిమాలు చేసేందుకు ఇక్కడి అగ్ర నిర్మాతలు సహకరించడమే. తెలుగు నిర్మాతలు తమిళ హీరోలతో సినిమాలు చేసేందుకు వారికి కోలీవుడ్లో ఇచ్చే పారితోషికం కంటే ఎంతో ఎక్కువగా ఇచ్చి వారిని ప్రోత్సహించడం గమనార్హం. మొదటి నుంచి టాలీవుడ్ లో తమిళ దర్శకులను ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే తమిళనాడులో తెలుగు దర్శకులకు పెద్దగా ఆదరణ లభించింది లేదు. ఇటీవల తమిళ హీరో విజయ్ తో దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా ప్రకటించగానే, అక్కడి తమిళ సినీ సంఘాలు హీరో విజయ్ పై విరుచుకుపడ్డాయి. తమిళ్ లో ఎవరూ దర్శకులు లేరా.. తెలుగు నుంచి తెచ్చుకోవాలా అంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. తెలుగు దర్శకుడు అక్కడ కేవలం ఒక్క సినిమా చేస్తున్నందుకే రచ్చ రచ్చగా మారింది. కానీ మన తెలుగు నిర్మాతలు మాత్రం ఇక్కడ హీరోలు లేనట్టుగా తమిళనాడు నుంచి మరీ తెచ్చుకొని వాళ్ళ డిమాండ్ కంటే ఎక్కువగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

ప్రస్తుతం తమిళ్ లో హీరో విజయ్ ఒక్కో సినిమాకు రూ. 60 నుంచి రూ.70 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుండగా దిల్ రాజు ఆయనకు రూ.90 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. అలాగే దిల్ రాజు బోయపాటి డైరెక్షన్లో తమిళ హీరో సూర్య హీరోగా మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటించేందుకు సూర్యకు కూడా ఇదివరకు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ కంటే అధికంగా ఇచ్చేందుకు దిల్ రాజు సిద్ధపడినట్లు సమాచారం.

తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించేందుకు హీరో ధనుష్ కు రూ. 50 కోట్ల పారితోషికం ఇస్తునట్లు సమాచారం. ధనుష్ ఇంతవరకు ఎప్పుడూ తమిళ సినిమాకు కూడా ఇంత పెద్ద మొత్తంలో అందుకోలేదు.

ఇలా తమిళ హీరోలకు వారు అందుకునే మొత్తం కంటే అధికంగా పారితోషకం ఇస్తూ తెలుగులో నేరుగా సినిమాలు నిర్మించేందుకు ఇక్కడ నిర్మాతలు సిద్ధపడడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తెలుగు దర్శకులు, తెలుగు హీరోలను ప్రోత్సహించాల్సింది పోయి..పరాయి భాష హీరోలను, దర్శకులను నెత్తిన పెట్టుకొనే ప్రయత్నాలు చేయడంపై సినీ ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -