హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో అత్యంత ఖరీదైన రాయదుర్గం భూముల సాక్షిగా మరో భారీ భూకబ్జా ఉదంతం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో ఏకంగా ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారికే రూ. 20 కోట్ల మేర టోకరా వేసిన నిందితుల వ్యవహారం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
వాసవి గ్రూప్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ఎర్రం విజయ్ కుమార్ రాయదుర్గంలోని సర్వే నంబర్ 66/2లో ఉన్న విలువైన భూమిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఇదే అదనుగా భావించిన దుగ్యాల పాపారావు, అట్టేపల్లి రామ ప్రభు మరియు ఇతర వ్యక్తులు ఆ భూమి తమదేనని, విక్రయించడానికి అన్ని అనుమతులు ఉన్నాయని విజయ్ కుమార్‌ను నమ్మించారు.నకిలీ పత్రాలను సృష్టించి విజయ్ కుమార్‌కు చూపించిన నిందితులు, 2023 డిసెంబర్ 7వ తేదీన రూ. 35 కోట్లకు భూమి విక్రయ ఒప్పందం చేసుకున్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా విజయ్ కుమార్ అడ్వాన్స్‌గా రూ. 20 కోట్లు నిందితులకు చెల్లించారు.డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు మరో మూడు నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని విజయ్ కుమార్‌కు హామీ ఇచ్చారు. అయితే గడువు ముగిసినా, రిజిస్ట్రేషన్ ఊసెత్తకుండా నిందితులు కాలయాపన చేయడం మొదలుపెట్టారు. విజయ్ కుమార్ ఎన్నిసార్లు సంప్రదించినా సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరగసాగారు.
నిందితుల ప్రవర్తనపై అనుమానం వచ్చిన విజయ్ కుమార్, సదరు భూమిపై ఆరా తీయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.ఆ భూమి 38-E ప్రొటెక్టెడ్ టెనెన్సీ ప్రకారం నిషేధిత జాబితాలో ఉందని తెలిసింది. ఆ భూమిని విక్రయించడానికి గానీ, రిజిస్ట్రేషన్ చేయడానికి గానీ చట్టపరంగా వీలు లేదని నిర్ధారణ అయ్యింది. తమకు లేని హక్కులను ఉన్నట్టుగా చూపిస్తూ నిందితులు నకిలీ పత్రాలతో తనను మోసగించారని విజయ్ కుమార్ గ్రహించారు.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్నారు. నకిలీ పత్రాల సృష్టిలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
