ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించి మరోసారి ఫైనల్‌కు చేరుకుంది ఆర్సీబీ. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ రజత్ పటిదార్. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రజత్ పటిదార్‌కు ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రాత్రి. ఆఖరి ఓవర్లలో పటిదార్ చేసిన విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త టీ20 ప్రపంచ రికార్డు నెలకొల్పారు. .
2022 తరహాలోనే హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో అతను చూపించిన బ్యాటింగ్ విశ్వరూపం మొదటి ఇన్నింగ్స్ ముగిసేసరికే మ్యాచ్ ఫలితాన్ని దాదాపు ఖరారు చేసింది. అతని వీరోచిత ఇన్నింగ్స్ (33 బంతుల్లో 93* పరుగులు) తో బెంగళూరు 92 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. మొదట 13 బంతుల్లో 21 పరుగులతో ఉన్న పటిదార్…ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి తర్వాతి 20 బంతుల్లోనే 72 పరుగులు రాబట్టాడు. దీనివల్ల ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (254/4) ను ఆర్‌సీబీ నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో కొట్టిన 10 సిక్సర్లతో రజత్ పటిదార్ ఒకే టీ20 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌గా సరికొత్త టీ20 ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ సీజన్‌లో అతని మొత్తం సిక్సర్ల సంఖ్య 41 కి చేరింది. గతంలో ఈ రికార్డు రియాన్ పరాగ్ పేరిట ఉండేది. అతను 2023/24 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అస్సాం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, జట్టును సెమీఫైనల్‌కు చేర్చే క్రమంలో 40 సిక్సర్లు బాదాడు.
అలాగే ఐపీఎల్‌లో ఈ రికార్డు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. 2025 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్‌కు నడిపించే క్రమంలో ఆయన 39 సిక్సర్లు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే, ఈ రికార్డు జర్మనీ కెప్టెన్ ముసద్దిక్ అహ్మద్ పేరిట ఉంది. ఈ నెల ప్రారంభంలో ఆస్ట్రియాతో జరిగిన హోమ్ టీ20 సిరీస్‌లో ఆయన 26 సిక్సర్లు బాదాడు.
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రెండు సీజన్లలోనే వరుసగా జట్టును ఫైనల్‌కు చేర్చిన ఐపీఎల్ చరిత్రలోని రెండో కెప్టెన్‌గా రజత్ పటిదార్ రికార్డు సాధించాడు. గతంలో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ 2022 లో ఐపీఎల్ టైటిల్ మరియు 2023 లో రన్నరప్‌గా నిలిపి ఈ రికార్డును సాధించాడు.
