తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఆరోగ్యం, అంతర్గత విభేదాలపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ, కేసీఆర్ చావును కోరుకునేది ఇద్దరే ఇద్దరని, వారే కేటీఆర్ మరియు హరీశ్ రావు అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి కోసమే కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడని, పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలనే తహతహ హరీశ్ రావులో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
కేసీఆర్‌కు అడ్డు వస్తోందనే కారణంతోనే ఆయన కుమార్తె కవితను రాజకీయంగా పక్కకు నెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. “పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పడమే బావ–బావమరిది పని” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పదేళ్ల పాలనను “రావణ రాజ్యం”గా అభివర్ణించిన కాంగ్రెస్ ఎంపీ, రామరాజ్యం కోసం తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ దౌర్భాగ్యపు పాలన చేయకపోతే రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశం వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. సీఎం పదవికి అవకాశం కల్పించిన కేసీఆర్‌కు చెడు జరగాలని రేవంత్ ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాళేశ్వరం తర్వాతే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగినట్టు హరీశ్ రావు మాట్లాడడం అతిశయోక్తి అని విమర్శించారు. స్వాతంత్య్రం తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్‌లు కాంగ్రెస్ పాలనలోనే నిర్మించామని గుర్తు చేశారు. ఇరిగేషన్‌పై తనకున్న తెలివి ఇంకెవరికీ లేదన్నట్టు హరీశ్ రావు ప్రజెంటేషన్ ఉంటుందని ఎద్దేవా చేశారు.
