బెంగళూరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏరో ఇండియా షోలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎలహంక వైమానిక స్థావరంలో జరుగుతున్న ఏరో ఇండియా షోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 150 కార్లు అగ్నికి దగ్ధం అయ్యాయి. ఈ ప్రదర్శనను చూసేందుకు వచ్చిన సందర్శకుల వాహనాలకు యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్ సమీపంలో పార్కింగ్ ఏర్పాటుచేశారు. వారాంతం కావడంతో భారీ సంఖ్యలో ఎయిర్ షోను తిలకించేందుకు వచ్చారు. దీంతో పార్కింగ్ ప్రాంతం కార్లు, ద్విచక్రవాహనాలతో నిండిపోయింది.
పార్కింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. భారీ అగ్నికీలలతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 150 కార్ల దగ్ధం అయినట్లు అధికారులు తెలిపారు.హుటాహుటిన ఘటనా స్థలానికి తరలి వెళ్లిన అగ్నిమాపక బృందాలు… మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 15 ఫైరింజన్ల మంటను ఆర్పెందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అన్న దానిపై ఇంకా సమాచారం లేదు.
ఏరో ఇండియా గేట్ 5 వద్ద 1 గంట సమయంలో మొదలైన మంటలు చూస్తుండగానే సమీపంలో పార్కు చేసిన వాహనాలకు పాకాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఎండుగడ్డి అధికంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించినట్టు చెబుతున్నారు. అక్కడే ఉన్న ఓ ఇంధన ట్యాంకు పేలడంతో ఘటనా ప్రాంతంలో భారీఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడ్డాయి. దీంతో ఎయిర్ షోను అధికారులు నిలిపి వేశారు. అయితే ఈ ప్రమాదం ఆకస్మాతుగా జరిగిందా, లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ పార్కింగ్ స్థలానికి సమీపంలోనే కొన్ని విమానాలను కూడా ఉంచినట్లు తెలుస్తోంది.
