వరంగల్ అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీకేజీ ఘటనపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక విచారణలో గత ఐదేళ్లుగా ఇన్-సర్వీస్ విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
2025-26 విద్యాసంవత్సరానికి చెందిన థర్డ్ ఇయర్ ప్రశ్నాపత్రాలు వరంగల్ అగ్రికల్చర్ వర్సిటీ నుంచి లీక్ అయినట్లు దర్యాప్తులో తేలింది. జూనియర్ అసిస్టెంట్ కార్తీక్ విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రశ్నాపత్రాలు వరంగల్, జగిత్యాల, అదిలాబాద్, రాజేంద్రనగర్, సిరిసిల్ల, అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీల్లో చదువుతున్న ఇన్-సర్వీస్ విద్యార్థులకు చేరినట్లు సీఐడీ గుర్తించింది.
ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు అధికారులు ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. సంబంధిత సిబ్బంది, విద్యార్థుల ఫోన్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో వర్సిటీ ప్రతిష్ట దెబ్బతిన్న నేపథ్యంలో, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
