సీఎం హోదాలో వైఎస్ జగన్ మొదటిసారి విశాఖలోని శారదాపీఠాన్ని సందర్శించారు. అమరావతి నుంచి బయల్దేరిని వైఎస్ జగన్‌కు విశాఖ ఎయిర్ పోర్టులో అభిమానులు ఘనస్వాగం పలికారు. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు జగన్‌కు స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్‌కు శారద పీఠంలోని వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్ జగన్ స్వరూపానందేంద్ర స్వామి వారికి కానుకలు సమర్పించారు. ఆయనకు కానుకలు సమర్పించిన జగన్, పాదాభివందనం చేశారు. ఈ సమయంలో జగన్‌ను స్వరూపానందేంద్ర స్వామి ఆలింగనం చేసుకుని, ఆప్యాయంగా ముద్దాడారు.రాజశ్యామల దేవికి జగన్ పూజలు నిర్వహించనున్నారు. త్వరలో కేబినేట్‌ను ఏర్పాటు చేయనున్న నేపధ్యంలో ముహూర్తం, మంత్రుల పేర్ల విషయమై స్వామితో సీఎం చర్చించినున్నట్టు తెలుస్తోంది.
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చినముషిడివాడ శారదా పీఠం వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 14 కిలోమీటర్లు అడుగడుగునా పోలీసుల పహారా నెలకొని ఉంది. శారదా పీఠం పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక సీఎం రానుండటంతో ఏ.డీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఆయన స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
