తైవాన్‌పై యుద్ధానికి చైనా సిద్ధమవుతోందా ?

- Advertisement -

చైనా నుంచి ముప్పు తప్పదని తైవాన్ భావిస్తోందా ? అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజల్ని ఎప్పటికప్పుడు తైవాన్ ప్రభుత్వం ఎందుకు హెచ్చరిస్తోంది ? ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత తైవాన్ ఎందుకు మరింత అప్రమత్తమవుతోంది ? డ్రాగన్ దేశం నుంచి తమకు ముప్పు తప్పదని తైవాన్ ఎప్పటి నుంచో అనుమానిస్తోంది. రష్యా .. ఉక్రెయిన్‌పై ఏక పక్షంగా యుద్ధానికి దిగిన తర్వాత తైవాన్‌లో ఈ భయాలు మరింత ఎక్కువయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు. ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు విధిస్తున్నా.. రష్యా ఏ మాత్రం లెక్కపెట్టడం లేదు. పుతిన్ మొండిగా ముందుకెళుతున్నారు. రష్యా చర్యలను పైకి సమర్థించకపోయినా ..యుద్ధాన్ని మాత్రం డ్రాగన్ దేశం గట్టిగా వ్యతిరేకించడం లేదు.

పుతిన్ ను చాలా విషయాల్లో అనుకరించే చైనా అధ్యక్షుడు జీ జింపింగ్ పైకి శాంతి వచనాలు వల్లె వేస్తున్నా… సందర్భంగా దొరికినప్పుడల్లా పొరుగు దేశాల సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. డోక్లాం, అరుణాచల్ ప్రదేశ్, గాల్వాన్ ఘటనలు జింపింగ్ యుద్ధకాంక్ష చెప్పకనే చెబుతున్నాయి. అటు దక్షిణ చైనా సముద్రంపై పట్టుకోసం డ్రాగన్ దేశం తెగబడని దుశ్చర్యలు లేవు. ఇక తైవాన్ తమలో భాగమేనని ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్న చైనా..ఈ చిన్న ద్వీప దేశాన్ని తనలో కలిపేసుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.

- Advertisement -

అప్పడప్పుడూ తమ యుద్ధవిమానాలను తైవాన్ గగనతలంలోకి పంపి భయపెడుతూ వస్తున్న చైనా తాజాగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాకా మరింత దూకుడు పెంచింది. తాజాగా తైవాన్ సమీపంలోకి చైనా తన యుద్ధనౌకలు, యుద్ధవిమానాలను పంపుతోంది. అమెరికా సహా అగ్రదేశాలు అభ్యంతరాలను పట్టించుకోని చైనా.. తైవాన్ విషయంలో ఎవరి జోక్యం సహించబోమని హెచ్చరిస్తోంది.

ఈ పరిణామాలతో చైనా నుంచి తమకు ముప్పు తప్పదని భావిస్తున్న తైవాన్ తన దేశ ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. యుద్ధ పరిస్థితులే వస్తే.. పౌరులు ఏం చేయాలో చెబుతూ ఇటీవలే హ్యాండ్ బుక్ పేరిట మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజాగా తైవాన్‌లో జరిగిన ఓ సంఘటన అక్కడి ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది. టీవీలో ప్రసారమైన ఓ వార్త వాళ్లను హడలగొట్టింది. రాజధాని తైపీ సమీపంలోకి చైనా సేనలు ప్రవేశించాయనీ, కీలక ప్రాంతాలపై క్షిపణులు దాడి జరిగినట్లు సదరు వార్త సారాంశం. టీవీ స్క్రీన్‌పై టిక్కర్ రూపంలో ప్రసారమైన ఈ వార్తతో జనం హడలిపోయారు.

తైపీ సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌కు చైనా ఏజెంట్లు నిప్పుపెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. తైవాన్ అధ్యక్షురాలు అత్యవసర పరిస్థితి ప్రకటించారని కూడా ఆ హెచ్చరికల్లో పేర్కొన్నారు. ఇవన్నీ తైవాన్‌ వాసుల్ని వణికించాయి. అయితే తప్పు తెలుసుకున్న సదరు వార్త సంస్థ .. క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్నిమాపక శాఖ చేసిన డ్రిల్ ను ఉద్దేశించే ఈ హెచ్చరికలు జారీ అయ్యాయనీ.. పొరపాటున టీవీలో ప్రసారమైనట్లు వెల్లడించింది. దాంతో తైవాన్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోందన్నది మాత్రం స్పష్టమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -