రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్ వద్ద వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన సభ’కు అడ్డంకులు తొలగిపోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. పర్యావరణం దెబ్బతింటుందని సభ అనుమతులను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది.
తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రగతి నివేదన సభ ద్వారా కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈసభద్వారా గత నాలుగున్నర సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ సభను నిర్వహిస్తోంది.
నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ఈ రోజు తిరస్కరించింది. ఈ సభ కోసం 25 లక్షల మందిని సమీకరిస్తున్నారనీ, లక్ష వాహనాలను వాడుతున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా సాంఘిక మాధ్యమాల ద్వారా చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలా సభలు పెట్టి ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని పిటిషన్ ద్వారా కోరారు.
ప్రభుత్వం తరుపున వాదించిన అడ్వకేట్ జనరల్ సమాధానంతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్వహించుకోవాలని సూచించారు.
