గంగానది ప్రక్షాళన కోసం సుదీర్ఘ పోరాటం చేస్తూ, 111 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ, చివరికి ప్రాణాలు అంకితమిచ్చిన కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ (86) ఆత్మార్పణం బీజేపీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 2014 ఎన్నికల్లో వారణాసి ఎంపీగా పోటీ చేసిన నరేంద్రమోడీ సహా బీజేపీ నేతలు గంగానది ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి, అధికారం చేపట్టాక గాలికొదిలేశారని జీడీ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. గత జూన్ నుంచి 111 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి పోలీసులు తరలించినా ఫలితం దక్కలేదు. ఆమరణ నిరాహార దీక్ష వలన గుండెపోటుతో ప్రొఫెసర్ అగర్వాల్ తుదిశ్వాస విడిచారు. 2012లో కూడా ఆయన దాదాపు రెండున్నర నెలల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో ఆయన దీక్షకు నాడు బీజేపీ నేతలు పూర్తి మద్దతు ఇచ్చి, గంగా ప్రక్షాళన అంశాన్ని తమకు ఓట్లు తెచ్చే అస్త్రంగా మార్చుకున్నారు. దీంతో నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అగర్వాల్ డిమాండ్లపై చర్చకు జాతీయ గంగానదీ పరీవాహక యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసింది. గంగా ప్రక్షాళనకు నిధులు కేటాయించేందుకు ముందుకు వచ్చింది.
అయితే 2014 ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ నేతలంతా నరేంద్రమోడీ సహా గంగా ప్రక్షాళన హామీని ఇచ్చి ఉత్తరాదిలో ఓట్లు దండుకున్నారు. జీవనది అయిన గంగానది అస్థిత్వం ప్రమాదంలో పడింది. కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పవిత్ర గంగాజలం కలుషితమైపోయింది. కాలకూట విషంలా మారింది. హిమాలయాల్లో పుట్టి.. బంగ్లాదేశ్ లో కలిసే గంగానది…మనదేశంలో 50 కోట్ల మందికి జీవనాధారం. అలాంటి పవిత్ర నదిని ప్రక్షాళన చేస్తాం. గంగాప్రక్షాళన కాదు మహా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. అంటూ మోడీ హామీలిచ్చారు. అధికారంలోకి రాగానే నమామి గంగే (గంగా ప్రక్షాళన) పేరుతో రెండేళ్లలో గంగానదిని ప్రక్షాళన చేసేస్తామని మోడీ సార్ ఘనంగా ప్రకటించేశారు. మోడీ ఎంపీగా పోటీ చేసిన వారణాశిలో ఇదే ప్రచారం చేసుకొచ్చారు. వీరి హామీలు నమ్మి ఉత్తరాదిలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మోడీ చెప్పినట్టే నమామి గంగే ప్రాజెక్ట్ ను హరిద్వార్ లో ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆ హామీ కేవలం మాటలకే పరిమితమైంది.
వాస్తవానికి గంగానదిని కాలుష్యం నుంచి కాపాడాలని, ప్రక్షాళన చేయాలని 2 దశాబ్దాల నుంచే ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2011లో నిగమానంద స్వామి, కాశీ మహా సంస్థాన్ పీఠాధిపతి నాగ్ నాథ్ యోగేశ్వర్ దీక్షలు చేసి ప్రాణత్యాగం చేశారు. దాంతో గంగా ప్రక్షాళన కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. సేవ్ గంగ పేరుతో ఉమాభారతి యూపీలో పెద్ద ఉద్యమాన్నే నడిపారు. బీజేపీ నేతలు దాన్ని ఎన్నికల స్టంట్ గా మార్చేయడంతో మన్మోహన్ ప్రభుత్వం నాడు గంగానది ప్రక్షాళన కోసం 4 వేల కోట్లు కేటాయించింది. కానీ అదే అంశాన్ని నాడు వారణాసి ఎంపీగా పోటీ చేసిన మోడీ, ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైతే నమామి గంగే పేరుతో ప్రక్షాళన చేసేస్తామని హామీ ఇచ్చారు. వీరి హామీ నమ్మి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ గంగా ప్రక్షాళన విషయాన్ని అటకెక్కించింది.
గంగా ప్రక్షాళన చేపట్టాలంటూ.. 2014 నుంచీ జీడీ అగర్వాల్ లెక్కలేనన్ని సార్లు మోడీ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఎన్నికల హామీ నెరవేర్చాలని నిలదీశారు. ఆఖరికి తప్పని పరిస్థితుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణాలు కోల్పోయారు. 111 రోజులుగా ఆయన ఆమరణ దీక్ష చేస్తున్నా మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతోనే ఆయన చనిపోయారు. దీంతో ఇప్పుడు ఉత్తరాదితో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి సహా ఉత్తరాది అంతటా బీజేపీకి చావుదెబ్బ తప్పదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దేశ ప్రజలను మోసం చేసిన మోడీకి సర్కార్ కు కాలం చెల్లిందని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ మండిపడుతున్నాయి.
