దేశీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇందన విభాగంలో (హైడ్రోకార్బన్స్) అనేక ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తాజాగా చమురు, సహజవాయువు వెలికితీత రంగంలోకి అడుగుపెట్టింది. కొత్తగా రెండు ఆఫ్‌షోర్ చమురు క్షేత్రాల్లో ముడిచమురు, గ్యాస్ వెలికితీసే పనిని చేపడుతోంది. గుజరాత్‌లోని కాంబెల్, అస్సాంలోని లక్ష్మీజెన్ ఆయిల్ ఫీల్డ్స్‌లో చమురు, గ్యాస్ వెలికితీత పనులను ప్రభుత్వం నుంచి పోటీ పద్దతిలో దకించుకున్న మేఘా 2020 సంవత్సరంలో ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పి. రాజేశ్‌రెడ్డి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (హైడ్రోకార్బన్స్) ఎంఈఐఎల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఇందన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కొత్త విధానం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం చేపట్టిన చమురు, సహజవాయు వెలికితీత క్షేత్రాలను ప్రైవేటు సంస్థలకు దశలవారీగా అప్పగిస్తుండగా తాజాగా రెండు చమురు క్షేత్రాలను ఎంఈఐఎల్ అభివృద్ధి చేయటంతోపాటు వాటిని నిర్వహిస్తూ, వాణిజ్యపరంగా ఉత్పత్తిచేసి పద్ధతిలో కేంద్రం ప్రభుత్వం నుంచి దక్కించుకుంది. పశ్చిమతీరాన కాంబేబేసిన్ (గుజరాత్) లోని కాంబెల్ ఆయిల్ ఫీల్డ్‌తో పాటు ఈశాన్య ప్రాంతమైన అర్కన్‌బేసిన్ (అసోం )లోని లక్ష్మీజెన్ ఆయిల్ ఫీల్డ్‌ను దక్కించుకుంది.
2022 నాటికి దేశీయంగా ఇంధన ఉత్పత్తులు పెరిగి విదేశాల నుంచి దిగుమతులు 10శాతం తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ రెండు క్షేత్రాలను మేఘా చేపట్టింది. అందుకు అనుగుణంగా ఇంధనం వెలికితీత కార్యక్రమాన్ని ముమ్మరం చేసేందుకు క్షేత్రస్థాయి పనులను ప్రారంభిస్తోంది. 2018లోనే బావులను డ్రిల్ చేయటం ద్వారా 2020లో వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో కార్యచరణను రూపొందించుకుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రానున్న రెండు మూడేళ్ళలో వంద మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా పెట్టుబడిని సొంతంగానే పెడుతోంది. కాంబెల్ క్షేత్రంలో దశలవారీగా మూడు బావులను తవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. లక్ష్మీజెన్ చమురు క్షేత్రంలో తవ్వకాలకు సంబంధించిన అనుమతులు అసోం ప్రభుత్వం నుంచి లభించాయని పి.రాజేశ్‌రెడ్డి వివరించారు.
ఈ రెండు ఆయిల్ ఫీల్డ్స్‌లోను ప్రధానంగా బావులను తవ్వడంతోపాటు క్రూడాయిల్‌ను వెలికితీసి ఆయిల్‌తోపాటు గ్యాస్‌ను శుద్ధిచేసేవిధంగా సంబంధిత ట్రీట్‌మెంట్, ఎఫ్లియెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. ఇంధనాన్ని రవాణా చేసి ప్రభుత్వ రంగ సంస్థలయిన ఐవోసీఎల్, హెచ్‌పిసీఎల్, బీపిసీఎల్, గెయిల్, జీఎస్‌పీఎల్‌తో పాటు ఎస్‌ఆర్, సీజీడి కంపెనీలకు, సంబంధిత పరిశ్రమలకు విక్రయిస్తుంది. గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ జిల్లాలో గల కాంబెల్ ఇంధన క్షేత్రం నుంచి పూర్తి జీవిత కాలం ఇంధనం లభిస్తుందని అంచనా వేసినట్లు పి.రాజేశ్‌రెడ్డి చెప్పారు. మొత్తం మీద 3.70 లక్షల బ్యారల్స్ (బిబిఎల్‌ఎస్) ముడిచమురును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అదే విధంగా లక్షా ముప్పయివేల ఘనప మీటర్ల గ్యాస్‌ను ప్రతీరోజు వెలికితీయాలనేది లక్ష్యం. ఓఎన్‌జిసిలోని నార్త్ సాంతల్ సెంట్రల్ ట్యాంక్ ఫారమ్(సిటీఎఫ్) కు 56 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.
డిజిహెచ్ (డైరక్టర్ జనరల్ హైడ్రోకార్బన్స్) అంచనా ప్రకారం కాంబే బేసిన్ (గుజరాత్) లోని కాంబెల్ ఆయిల్ ఫీల్డ్‌తో పాటు అసోంలోని లక్ష్మీజెన్ ఆయిల్ ఫీల్డ్‌లో వాణిజ్యపరమైన చమురు, గ్యాస్ ఉత్పత్తిచేయడానికి సమృద్ధిగా వనరులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో చమురు ఇంధన వనరులను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విధానం (లైసెన్సింగ్ విధానం) ప్రకారం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చమురు క్షేత్రాలకు ప్రైవేటు సంస్థలను ఎంపికచేసింది. ఆ విధంగా మేఘా రెండు క్షేత్రాలను దక్కించుకుంది. మేఘా ఇంజనీరింగ్ పూర్తి స్థాయిలో సొంత నిధులు, ఇంజనీరంగ్ నైపుణ్యంతో స్వయంగా వీటిలో పనులను ప్రారంభిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారెంటీలు సమకూర్చటం, ఒప్పందం చేసుకోవడం తదితర పరిపాలనాపరమైన పనులను పూర్తిచేసింది.
మేఘా ఇంజనీరింగ్‌కు ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంధన రంగంలో అనేక ప్రాజెక్టులను పూర్తిచేసింది. భారతదేశంలో అసోం, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులును చేపట్టడమే కాకుండా కువైట్, జోర్డాన్, బంగ్లాదేశ్, సింగపూర్ తదితర దేశాలలో రిఫైనరీ తదితర పనులను చేస్తోంది. ఇంధన రంగంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌళిక సదుపాయాలైన ప్రతిష్టాత్మక ముడి ప్రాసెసింగ్ ప్లాంట్లు, కంప్రెసర్ ప్లాంట్లు, గ్యాస్ ఆధారిత క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ లాంటి అనేక పనులను సకాలంలో పూర్తి చేస్తోంది. ఎంఈఐఎల్ హైడ్రోకార్బన్స్ ఇంజనీరింగ్ నిపుణుల బృందం ఫ్యాబ్రికేషన్స్, ఇన్‌స్టాలేషన్స్, హుక్ అప్ వంటి వాటి కోసం అధునాతన సాంకేతిక పద్ధతులను అవలంభిస్తుంది. ప్రపంచ శ్రేణి నాణ్యత ప్రమాణాలతో, అనుకున్న సమయం కంటే ముందుగానే అంటే రికార్డ్ సమయంలో ప్రాజెక్ట్‌లను పూర్తిత చేయడానికి ఎంఈఐఎల్ హైడ్రోకార్బన్స్ బృందం ప్రాధాన్యత ఇస్తోంది.
దేశీయంగా గృహ అవసరాలకు ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రప్రభుత్వం పైప్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే అప్పటికే తొలిసారిగా గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను సరఫరా చేసే ప్రాజెక్ట్‌ను మేఘా ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తూంకూరు, బెల్గాం జిల్లాలో ప్రారంభించి అడుగు ముందకు వేసింది. ఇందులో భాగంగా తెలంగాణలోని పది జిల్లాలో 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్ అందించేందుకు 3100 కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు మేఘా ఇంజనీరింగ్ ఇటీవలనే దక్కించుకుంది. మేఘా ఇంజనీరింగ్ హైడ్రోకార్బన్స్ డివిజన్ దేశవ్యాప్తంగా సహజవాయువు పైపులైన్లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గృహ, వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ (మేఘా గ్యాస్) సరఫరా చేయటం ద్వారా జీవన ప్రమాణాలను, సమాజంలో ఇన్‌ఫ్రా ఫలాలు నేరుగా అందించేందుకు ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. రవాణా అవసరాలు తీర్చే విధంగా కూడా మౌలిక వసతులను ఇప్పటికే ఏర్పాటు చేసింది.
