Sunday, May 12, 2024
- Advertisement -

ఆంధ్రా లో బ్లాక్ మనీ ఇలా వైట్ చేసేస్తున్నారు

- Advertisement -
New Ways to Exchange Money in ANdhra

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో దొడ్డిదారిన చేతులు మారిన నగదు మొత్తం 2వేల కోట్ల రూపాయిలుగా చెబుతున్నారు. హైదరాబాద్.. విజయవాడ.. గుంటూరు.. అనంతపురం.. కర్నూలు కేంద్రాలుగా చేస్తున్న దందా తాజాగా బయటకు వస్తోంది. ఈ ఐదు నగరాల్లోని బ్యాంకుల్లో భారీగా నగదు డిపాజిట్ చేస్తున్న వైనంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

మొన్నటికిమొన్న దిల్ షుక్ నగర్ కు దగ్గర్లోని సిండికేట్ బ్యాంకుకు చెందిన సిబ్బంది అక్రమంగా రూ.50లక్షలు మార్చిన వైనం ఎంత సంచలనం సృష్టించిందన్నసంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై పోలీసులకు ఉప్పు ఎలా అందిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. రిజర్వ్ బ్యాంకులో పని చేస్తున్న ఒక ఉద్యోగికి తెలిసిన వారు ఒకరు ఫోన్ చేసి.. తన దగ్గర ఉన్న రూ.25లక్షల పాత నోట్లు తీసుకొని రూ.20 లక్షల కొత్త నోట్లు ఇస్తామని చెబుతున్నారని.. అలాంటి వారిని నమ్మొచ్చా? అని ప్రశ్నించటంతోఅలెర్ట్ అయిన సదరు అధికారి.. మాటల్లో పెట్టి అసలు వివరాలు సేకరించి.. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సిండికేట్ బ్యాంకు ఎపిసోడ్ బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ తరహా మోసాల్ని బ్యాంకు సిబ్బంది మాత్రమే కాదు..కొందరు కక్కుర్తి బ్యాంకు మేనేజర్లు కూడా చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు నెల్లూరుకు చెందిన ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకుచెందిన సీనియర్ మేనేజర్ చేసిన కక్కుర్తి పని ఒకటి బయటకు వచ్చింది. ఒక వడ్ల వ్యాపారికి ఏకంగా రూ.2కోట్ల విలువైన వంద నోట్లను ఇవ్వటం సంచలనంగా మారింది. చిల్లర లేదని ఇబ్బంది పడుతున్న సామాన్యులకు రూ.2వేల నోట్లను అంటగట్టిన సదరు మేనేజర్.. వడ్లవ్యాపారికి మాత్రం వంద నోట్లను కోటి రూపాయిల వరకూ అడ్జెస్ట్ చేయటంపై ఉన్నతాధికారులు ఇప్పుడు విచారిస్తున్నారు. ఇదే తరహా ఘటనలు విజయవాడలోనూ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఉన్న ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాలుగుబ్యాంకులకు అందించాల్సిన రూ.12.5కోట్ల మొత్తాన్ని నాలుగో వంత తానుపంపిన వారికి ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.పాత నోట్లకు 30శాతం తక్కువగా కొత్త నోట్లను ఇచ్చేశారు. ఈ నోట్లు తీసుకున్న వారు 40శాతం తక్కువగా పాత నోట్లను మార్చుకునే మారు బేరానికి దిగారు.ఇలాంటి దందా విజయవాడ.. గుంటూరులో భారీగా సాగుతోంది. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతుండటంతో ఇప్పుడు వారంతా జారుకున్నారని చెబుతున్నారు.

తాజాగా హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన ఒక ప్రైవేటు బ్యాంకు సమకూర్చిన మొత్తంలో 80 శాతం నగదు బయటకు తరలించిన విషయం రిజర్వ్ బ్యాంకు దృష్టికి వచ్చింది. దీంతో మంగళవారం బయట బ్రాంచులకు చెందిన సిబ్బందిని బ్యాంకులో విదులు నిర్వహించేలా చేశారు. పెద్దనోట్ల రద్దు.. కొత్త నోట్ల హడావుడి నేపథ్యంలో సహకార బ్యాంకుల్లో పవర్ దందా నడుస్తోంది. పెద్దమనుషులుగా చెలామణీ అయ్యే వారు ప్రభావితం చేసి తమకు తగ్గట్లుగా డబ్బులు తీసుకునే వైనానికి తెర తీశారు. దీనిపై దృష్టిసారించిన రిజర్వ్ బ్యాంకు నగదు మార్పిడికి చెక్ చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. యూపీ.. మహారాష్ట్ర.. కర్ణాటక.. ఆంధ్రప్రదేశ్ లలోని సహకార బ్యంకుల నుంచి భారీగా డబ్బు రాజకీయప్రముఖులకు చేరిన విషయాన్ని నిఘా సంస్థలు గుర్తించటంతో వాటికి నగదును మార్చే అవకాశాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా పలు చోట్ల కొత్త నోట్ల దందాకు బ్యాంకులు.. బ్యాంకు అధికారులే కేంద్రంగా నడుస్తోంది. ఇలాంటి వారికి చెక్ చెప్పటమే కాదు.. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారికి భారీగా శిక్షలు విదించటంతో పాటు.. ఇలాంటి మోసాలు చేసిన వారి ఉదంతాల్ని మీడియాలో భారీగా ప్రచారం చేయటం ద్వారా బ్లాక్ మనీ రాయుళ్ల జోరుకు బ్రేకులు వేసే వీలుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -