డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వేడుకల కోసం కొంత సడలింపు ఇచ్చినా, చట్ట అమలులో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, నూతన సంవత్సర రాత్రి బార్లు, క్లబ్బులు, లైసెన్స్ పొందిన ఈవెంట్ వేదికలు, అలాగే కొన్ని పర్యాటక ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయానికి అనుమతి ఉంటుంది. అయితే దీనికి ముందస్తు అనుమతి తప్పనిసరి. వైన్ షాపులు, ఏ–4 మద్యం దుకాణాలు మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకే పనిచేయాల్సి ఉంటుంది. దీనిలో ఎలాంటి మినహాయింపులు ఉండవు.
హైదరాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలు, వ్యాపార సంస్థలు చట్ట పరిధిలోనే బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. బుధవారం నుంచి జనవరి 1 వరకు ప్రత్యేకంగా మద్యం మత్తులో డ్రైవింగ్‌పై తనిఖీలు చేపడతామని తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి మాత్రమే నగర వ్యాప్తంగా దాదాపు 100 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని, అదనపు బలగాలు మోహరిస్తామని వెల్లడించారు.
మద్యం సేవించి వాహనం నడిపితే వాహన స్వాధీనం, గరిష్ఠంగా రూ.10,000 జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు లేదా సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు టాక్సీలు, యాప్ క్యాబ్స్ వినియోగించాలని లేదా డిజైనేటెడ్ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల్లో నూతన సంవత్సర పార్టీలన్నీ రాత్రి 1 గంటకే ముగియాలని ఆదేశించారు. శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్స్ స్వాధీనం చేస్తామని, డ్రగ్స్, అసభ్య ప్రదర్శనలు, అల్లర్లు, అశాంతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు.మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ వేదికలు, రద్దీ ప్రాంతాలు, ప్రజా ప్రదేశాల్లో షీ టీమ్స్‌ను మోహరిస్తామని అధికారులు తెలిపారు. నూతన సంవత్సరాన్ని సురక్షితంగా, చట్టబద్ధంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
