దేవుడి సొంత ప్రదేశం కేరళను సోమాలియాతో పోల్చడంపై ప్రధాని నరేంద్ర మోదీపై సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్య జరిగిన ఓ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కేరళలో దళితులపై ఉచకోత, యువతిపై అత్యారం వంటి సంఘటనలు జరగడం బాధాకరమని, ఇక్కడి ప్రభుత్వం ఆ సంఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ప్రధాని ఇంకాస్త ముందుకెళ్లి కేరళను చూస్తూంటే సోమాలియాలా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అనేక మంది ట్విట్టర్ లో తన అభ్యంతరాలను పోస్ట్ చేశారు. అంతే కాదు ‘పో మోన్ మోదీ’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఇది ఓ మళయాళం సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘పో మోనే దినేశా’కు పేరడీ. ‘ఇక చాలు, ఇంటికి వెళ్లు’ అని దీనికి అర్థం.
మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమేష్ చాంద్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ నెల 16న కేరళలో ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి మీద, ఆయన కుమారుడి మీద రాష్ట్రంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
