అమెరికా ప్రభుత్వం స్తంభించిపోనున్నది. కొత్త బడ్జెట్ ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సేనేట్ ద్రవ్య వినమయ బిల్లుకు ఆమోదం తెలుపలేదు. ఆ కారణంగా ఫెడరల్ ఆఫీసులన్నీ మూసివేతకు గురయ్యే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వ వార్షిక లావాదేవీలు నిలిచిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సమయంలోనే ఇలాంటి పరిస్థితి రావడం గమనార్హం.
యూఎస్ సెనేట్‌లో జనవరి 19లోగా ద్యవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. అయితే డెమోక్రాట్లు, రిపబ్లికన్ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. తల్లిదండ్రుల వెంట అమెరికాకు వచ్చిన పిల్లల్ని(స్వాప్నికులు) తిప్పి పంపకుండా.. వారి పరిరక్షణకు తీసుకునే చర్యల్ని బిల్లులో చేర్చాలని డెమొక్రట్లు పట్టుబడుతున్నారు. ఒబామా హయాంలో స్వాప్నికులకు తాత్కాలికంగా చట్టబద్ధ హోదా కల్పించినా, ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ విధానంలో మార్పులు తీసుకొచ్చారు.
వీరికి చట్టపరంగా లభిస్తోన్న భద్రతను తొలగించేందుకు గత సెప్టెంబర్‌లో చర్యలు ప్రారంభించారు. దీనిని డెమొక్రట్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే వలస విధానం భిన్న అంశమని, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ సభ్యులు వాదిస్తున్నారు. ఫండింగ్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 230-197 ఓట్లు పోలయ్యాయి. కొందరు రిపబ్లికన్లు కూడా దానిని వ్యతిరేకించటంతో ప్రభుత్వం చర్చలకు డెమొక్రట్లను ఆహ్వానించగా.. చర్చలు విఫలం అయ్యాయి.
ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ ఖర్చులకు సంబంధించి వినిమయ బిల్లులో వేటిని చేర్చాలి.. ఎంత కేటాయింపులు చేయాలన్న దానిపై అమెరికన్ కాంగ్రెస్‌లో విభేదాలు కొనసాగితే ఈ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే రోజువారీ వ్యవహారాలకు అవసరమైన నిధులు నిలిచిపోయి షట్‌డౌన్ మొదలవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్ని పూర్తిగా మూసివేస్తారు. అత్యవసర విభాగాలు(రక్షణ వ్యవహారాలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, ఎఫ్‌బీఐ వంటివి) మినహా అధిక శాతం ప్రభుత్వ సర్వీసులు నిలిచిపోతాయి.
షట్‌డౌన్‌తో ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వం మూతపడే అవకాశం ఉంది. బిల్లు ఆమోదానికి మరో 9 మంది డెమోక్రాట్ల మద్దతు అవసరం. ప్రతినిధుల సభలో 230-197 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. కానీ యూఎస్ సెనేట్‌లో బిల్లు ఆమోదం నిలిచిపోయింది. దీంతో అత్యవసరం మినహా ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
