Thursday, April 18, 2024
- Advertisement -

ప్రజల చేత హీరో అనిపించుకోవాలి… మోడీ దగ్గర మాత్రం జీరో అన్న ముద్రే ఉండాలి

- Advertisement -

పదేళ్ళ తర్వాత ఆరు వందల హామీలు, వ్యూహాలు, కుట్రలతో అధికారంలోకి వచ్చాడన్న మాటేగానీ ఆ ఆనందాన్ని మాత్రం మూడున్నరేళ్ళలో ఒక్క రోజు కూడా అనుభవించలేకపోతున్నాడు చంద్రబాబు. ఒక వైపు తన తర్వాత ముఖ్యమంత్రిగా లోకేష్ ఒక్కడే దిక్కు అని ఎపి ప్రజలను నమ్మిద్దామంటే….లోకేష్ మాత్రం తాను తెలుగు రాహుల్ గాంధీగా పేరు తెచ్చుకుని కామెడీ అయిపోతూ ఉన్నాడు. ఇక రాజకీయంగా తెలంగాణాలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. జాతీయ పార్టీ అని బాబు చేసిన కామెడీ స్టంట్ ఎటకారమైపోయింది. ఇక ఓట్లేసి గెలిపించిన ఎపి ప్రజలను నిండా ముంచిన పరిస్థితి. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా…. విభజన నాడు కేంద్రం ఇచ్చిన హామీలను కూడా తీసుకురాలేని పరిస్థితి. ఎపికి మోడీ ఒక్క సాయం కూడా చేయకపోయినప్పటికీ….. మోడీకి అస్సలు చెడ్డపేరు రాకుండా కాపాడాల్సిన అగత్యం బాబుది. ఓటుకు కోట్లు కేసుతో పాటు తన బొక్కలన్నీ బయటపడకుండా మేనేజ్ చేసుకోవడంలో చంద్రబాబుకు అలా మూడున్నరేళ్ళ పుణ్యకాలం గడిచిపోయింది. దేశంలో కంటే ఎపిలోనే వృద్ధి రేటు ఎక్కువ లాంటి కామెడీలు ఎన్ని చేసినా ప్రజలకు అస్సలు నమ్మకం పెరగడం లేదు. దాంతో ప్రజల వ్యతిరేకతను మోడీపైకి మళ్ళించాలి అన్నది బాబు ఆలోచన. కానీ ఆ విషయం మోడీకి తెలియకుండా మేనేజ్ చేయకపోతే …….మోడీతో తేడా వస్తే కటకటాల దారి తప్పదు అన్నది చంద్రబాబు భయం.

ప్రజల దగ్గర తాను రాష్ట్రం కోసం పోరాడుతున్న హీరోగా నిలబడాలి. అలా జరగాలంటే హోదాతో సహా అన్ని విషయాల్లోనూ ఎపిని ముంచిన కేంద్ర ప్రభుత్వాన్ని(టిడిపి-బిజెపిల ప్రభుత్వం అది) నిందించాలి. తన పార్టీ కేంద్రమంత్రులను కూడా విమర్శించాలి. ఆ మంత్రులకు నాయకుడైన తనను తాను కూడా తిట్టుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా మోడీని విమర్శించాలి. అదే జరిగితే ఆ మరుక్షణం నుంచీ చంద్రబాబుకు కటకటాల దారి తెరుచుకోవడం ఖాయం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీని విమర్శించి హీరోయిజం చూపించేంత సీన్ బాబుకు లేదు. మోడీ దగ్గర మాత్రం జీరోగానే ఉండాలి. కానీ ప్రజల చేత మాత్రం హీరో అనిపించుకోవాలి. అందుకే కోర్టులో కేసులు వేస్తా అని ఓ కొత్త కామెడీ పాయింట్‌తో ముందుకొచ్చాడు బాబు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఒక్క శాతం తెలివితేటలు కూడా ఉండవు అన్న అభిప్రాయంతో రాజకీయాలు చేసే నేతల్లో చంద్రబాబు దేశంలోనే అగ్రగణ్యుడు. అందుకే కోర్ట్ వ్యవహారాలు ఎలాగూ ప్రజలకు తెలియవు అన్న ఉద్ధ్యేశ్యంతో కోర్టులో కేసు వేస్తా అన్నాడు.

చంద్రబాబు కోర్టులో కేసు ఎవరి మీద వేయాలి? రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నవాళ్ళ మీద…… ఆ అన్యాయం చేస్తున్నదెవరు…….కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం. అందులో టిడిపి కూడా భాగస్వామి పార్టీ. అంటే చంద్రబాబు మోడీపై కోర్టులో కేసు వేస్తాడు అన్న అర్థమే వస్తుందిగా…….ఈ విషయం చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. కానీ అత్యంత అనుభవజ్ఙుడని అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం కేసులు వేసేది మోడీపైన, కేంద్ర ప్రభుత్వంపైనా కాదు అని ఈరోజు ఘనంగా ప్రకటించాడు. మోడీ నుంచి ఏం హెచ్చరికలు వచ్చాయో కానీ ఆ తత్తరపాటు మొత్తం కనిపించింది. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల కోసం కేంద్రంతో పోరాడకుండా ఇంకెవరి పైన పోరాడతాడట మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబుగారు.

మొత్తానికి మరోసారి కోర్టుల్లో కేసు వేసి పోరాడతా అనడం…….ఆ తర్వాత పైనుంచి చివాట్లు రావడం…..ఆ వెంటనే పోరాటం కేంద్రంపైన, మోడీ పైన కాదు అంటూ మాట్లాడిన కామెడీ మాటలతో నెటిజనులకు మంచి కామెడీ హీరో అయిపోయాడు బాబుగారు. కాకపోతే మోడీ దగ్గర జీరోయిజం మాత్రమే చూపించాలి……ప్రజలు మాత్రం దాన్ని హీరోయిజం అనుకునేలా చేయాలి అన్న తాపత్రయంలో మూడున్నరేళ్ళుగా బాబు చేస్తున్న కామెడీ స్టంట్స్‌ లిస్టులో ఇప్పుడు మరొకటి చేరిందన్నది నిజం. ఈ స్టంట్‌తో సామాన్య ప్రజలకు కూడా బాబు చేతగానితనం గట్టిగానే అర్థమైందన్నది విశ్లేషకుల మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -