జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ? అంటే రెండింటికీ గడ్డుకాలమేనని చెప్పాలి. కాకపోతే గతంలో అంటే 2014లో ఉన్నంత తీవ్రమైన వ్యతిరేకత, కోపం ప్రస్తుతానికి కాంగ్రెస్ మీద ప్రజలకు తగ్గాయనే చెప్పాలి. కాంగ్రెస్ వాళ్లు విభజన చేస్తామని చెప్పి చేశారు. అందుకు ప్రతిఫలంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా నాటి యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. కానీ ప్రభుత్వం మారాక ఆయన స్థానంలో వచ్చిన నరేంద్రమోడీ నమ్మించి మోసం చేశాడు. ఎన్నికల ముందు ఏపీలోని అన్ని సభల్లోనూ ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పాడు. కాంగ్రెస్ బిడ్డను చంపి తల్లిని బతికించింది. మేము అలా చేయమని చెప్పి, హోదా ఇస్తామని ఆశ పెట్టి నట్టేట ముంచేశారు. ఈ అంశాలు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే నాలుగేళ్లుగా ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నా హోదా ఇవ్వకపోవడంతో ఈ నాలుగేళ్లలో రావాల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏపీకి రాకుండా పోయాయి. ఈ నష్టానికి పూర్తి బాధ్యత కేంద్రప్రభుత్వం, బీజేపీ, నరేంద్రమోడీదేనని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. మీకంటే కాంగ్రెస్సే నయం, చెప్పి విభజించారు. మీరు హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారు. అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పినట్లే 2019లో బీజేపీకి బుద్ధి చెబుతాం. ఏపీలో ఆ పార్టీ పునాదులు కూడా లేకుండా పెకలించేస్తాం. అని కసితో రగిలిపోతున్నారు.
జనం నాడిని పసిగట్టిన చంద్రబాబు బీజేపీతో దోస్తీకి గుడ్ బై చెప్పేశారు. తెల్లారిలేచింది మొదలు ఆ పార్టీ నేతలు చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. హోదా ఇస్తామని ఇప్పటికే పదే పదే ప్రకటిస్తున్న కాంగ్రెస్ సహా ఏ ఇతర పార్టీతో అయినా పని చేయడానికి తాము సిద్ధం అన్నట్టు సంకేతాలిస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందాలతో 2019లో ఎన్నికలకు వెళ్లడానికి బాబు సిద్ధమవుతున్నారు. ఇక రేపో మాపో ఏపీలోని మూడు ప్రధాన పట్టణాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఆ సభల ద్వారా విభజన శాస్త్రీయంగా జరగలేదని క్షమాపణ చెప్పి, యూపీఏ అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం ఏపీకి ప్రత్యేకహోదాపైనే అని మరోసారి ప్రకటించనున్నారు. ఆ ప్రకటన అనంతరం ఏపీలో కాంగ్రెస్ కు కొంత నూతనొత్సాహం వస్తుంది. ప్రజలు కూడా చేసిన తప్పు తెలుసుకున్నారు. లెంపేలేసుకున్నారు. ఇప్పుడు గతం కంటే భవిష్యత్ ముఖ్యం అనే ఆలోచనతో కాంగ్రెస్ పట్ల సానుకూలంగా స్పందించే అవకాశముంది. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కు రాహుల్ నాయనమ్మ ఇందిర, తండ్రి రాజీవ్ గాంధీ కాలం నుంచీ బలమైన అభిమానులు ఏపీలో ఉన్నారు. వాళ్లంతా మళ్లీ హస్తం పార్టీని ఎంతోకొంత వరకూ ఆదరించడం ఖాయం. ఈ విషయాలను గ్రహించిన చంద్రబాబు బీజేపీతో వైరం పెంచుకుని, కాంగ్రెస్ తో కలవడానికైనా సిద్ధమేనన్నట్టు వ్యవహరిస్తున్నాడు.
వైఎస్ జగన్ మాత్రం ఇంకా పాత శతృత్వాన్ని గుర్తు పెట్టుకుని కాంగ్రెస్ కు దూరంగానే ఉంటున్నాడు. దానికి తోడు చంద్రబాబు కాంగ్రెస్ కలిసిపోతున్నారు. మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు…అంటూ కాంగ్రెస్ ను ఓ అంటరాని పార్టీలా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ కాదు బీజేపీ అంటరాని పార్టీగా ప్రజల్లో మిగిలిపోయింది. కానీ జగన్ బీజేపీని పల్లెత్తు మాట అనట్లేదని ఇప్పటికే అతడిపై విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీతో బహిరంగంగా కాకపోయినా, లోపాయికారిగా అయినా ఆయన కలిసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అందుకు జగన్ వ్యవహారశైలే కారణం. తమ పార్టీ నేతలు ఎంత గొంతుచించుకుంటున్నా బీజేపీ వైఎస్ఆర్ సీపీ మిత్రులేననే సంకేతాలు జనంలోకి వెళ్లిపోయాయి. వాటిని నిజం కాదని నిరూపించుకుని, బీజేపీకి వీలైనంత ఎక్కువ దూరంలో ఉంటేనే జగన్ పార్టీకైనా, ఏ ఇతర పార్టీకైనా ఏపీలో మనుగడ. ఆ విషయం గ్రహించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. జగన్ మాత్రం ఫెయిల్ అయ్యాడు.
