Thursday, May 9, 2024
- Advertisement -

బాబు బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్… జగన్ వ్యూహంలో అడ్డంగా ఇరుక్కుపోయిన చంద్రబాబు

- Advertisement -

రాజకీయ వ్యూహాలు, కుట్రలు పన్నే విషయంలో అత్యంత అనుభవజ్ఙడు అయిన చంద్రబాబు కూడా సెల్ఫ్ గోల్ వేసుకునేలా చేయాలంటే ఎంతటి వ్యూహం ఉండాలి? అలాంటి వ్యూహాన్ని అమలు పరిచాడు జగన్. ఎక్కడా అత్యుత్సాహ పడకుండా వైకాపా-టిడిపిల విమర్శలు-ప్రతివిమర్శల విషయంగా ఆంద్రప్రదేశ్ ప్రజలకు లైట్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా బాబును అడ్డంగా బుక్ చేశాడు జగన్. రాహుల్‌పై ప్రేమతో కాంగ్రెస్ పార్టీని ఫణంగా పెట్టిన సోనియాలానే ఇప్పుడు లోకేష్‌పై ప్రేమతో దారుణమైన తప్పులు చేస్తున్నాడు బాబు.

దుర్గ గుడిలో తాంత్రిక పూజల వైనాన్ని వ్యూహాత్మకంగా బయటపెట్టింది వైకాపా. సాక్ష్యాధారాలతో సహా నిరూపించి లోకేష్ కోసమే ఈ తాంత్రిక పూజలు అన్న విషయాన్ని ఆ పూజలు చేసినవాళ్ళతోనే చెప్పించింది. అయితే ఎక్కడా కూడా అత్యుత్సాహపడిపోయి ఆవేశపూరిత ప్రసంగాలు చేసి ఇష్యూని డైవర్ట్ చేయలేదు. విషయానికి మాత్రమే పరిమితమయ్యారు. అధికారులు, ఆలయ ఉద్యోగుల మాటలే ఎక్కువగా ప్రజలకు చేరువయ్యేలా చేశారు. సాక్ష్యాధారాలతో నిరూపితమవ్వడంతో చంద్రబాబుకు కూడా స్పందించక తప్పలేదు. అయితే ఆ ప్రక్రియలో తనకు తానే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ దుర్గగుడిలో తాంత్రిక పూజలు లోకేష్ కోసమే అన్న విషయాన్ని నిజం అని మరికాస్త బలంగా నమ్మించేలా సాగాయి చంద్రబాబు చర్యలు.

ముందుగా మంత్రి మాణిక్యాలరావు చేత రాష్ట్రపతి భార్య దర్శనం సందర్భంగా ఆ ఏర్పాట్లు చేశామని చెప్పించారు. అయితే మంత్రి చెప్పింది ఎంత పెద్ద అబద్ధమో వెంటనే తెలిసిపోయింది. రాష్ట్రపతి భార్య సందర్శనం కోసమే అయితే శాంత స్వరూపిణి రూపంలో ఉన్న అమ్మవారిని భీకరరూపంగా మార్చాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే మంత్రి మాటల్లో డొల్లతనం బయటపడిపోయింది. అబద్ధాలతో అడ్డంగా దొరికిపోయిన మంత్రిగారే తాంత్రిక పూజలు జరిగాయన్న నిజాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది.

ఇక ఆ తాంత్రిక పూజల సమాచారాన్ని లీక్ చేయడానికి కారణమయ్యారని భావిస్తున్న వాళ్ళపై ప్రభుత్వం శిక్షలు వేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది. క్యూ లైన్ ఇన్‌స్పెక్టర్‌ని సస్పెండ్ చేశారు. ఒక అర్చకుడిని మార్చేశారు. కానీ ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన ఈవో సూర్యకుమారిని మాత్రం ఏమీ అనలేదు. తాంత్రిక పూజలు జరిగాయని పాలకమండలి అధ్యక్షుడు గౌరంగ బాబు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈవో శాంతకుమారి పాత్ర ఉందని చెప్తున్నారు.

అన్నింటికీ మించి ఈ తాంత్రిక పూజల వ్యవహారంపై చంద్రబాబు అప్పటికప్పుడు ఓ కమిటీ వేశారు. రాజధాని భూముల వ్యవహారంలో అలజడుల నుంచీ, పుష్కర ప్రమాదాల వరకూ తన తప్పులు, టిడిపి నేతల తప్పులు ఉన్న ప్రతి సందర్భంలోనూ చేసే పని ఇదే. అప్పటికప్పుడు ఓ కమిటీ వేస్తాడు. దాని అర్థం ఏంటంటే ఇక ఆ విషయాన్ని అంతటితో చల్లార్చలన్న ప్రయత్నం అని ఉన్నతాధికారులే చెప్తూ ఉంటారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తుంటే అర్థమయ్యే విషయం ఒక్కటే. లోకేష్ స్థాయి ఉన్నవారికోసమైతే తప్ప వేరే ఎవరికోసమైనా ఇంతటి హడావిడి ఉంటుందా? ఇంత ఉలికిపాటు ఉంటుందా? ఈ దిద్దుబాటు చర్యలన్నీ కూడా జగన్ పార్టీ, సాక్షి మీడియాలో వ్యూహాత్మకంగా సాక్ష్యాధారాలతో వచ్చిన విషయాలను చంద్రబాబు కూడా ఒప్పుకుంటున్నాడన్న విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు టివి చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. లోకేష్ కోసం చంద్రబాబు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నాడని చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -