Thursday, May 9, 2024
- Advertisement -

ఇక చాలు, 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ బాబూ!

- Advertisement -

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుదేలైన పార్టీని సంస్కరించే చేసే విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజా మద్దతు లేక ప్రతిపక్షంలో కూర్చున్నా ఆయన తీరు మారినట్టుగా లేదు. సైకిల్‌ రిపేర్‌ చేయాల్సిన సమయాన్ని ఆయన వృథా చేస్తున్నారేమో అనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అంతర్గత అంశాల్ని పట్టించుకునేంత తీరికా, ఓపికా ఉండదు. విపక్షంలో ఉన్న సమయంలో బోలెడంత ఖాళీ దొరుకుతుంది. జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

కానీ.. అలాంటివేమీ చేయకుండా సమస్యల్ని అదే పనిగా నానబెట్టే బాబు ధోరణితో పార్టీకి నష్టం వాటిల్లుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పార్టీ పరిస్థితే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. జిల్లాలోని.. పి.గన్నవరం, రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి సరైన నేతలు లేరు. గత ఎన్నికల వేళ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థులు సైకిల్ దిగేశారు. కండువాలు మార్చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ పార్టీని నడిపించే నేతలే కరువయ్యారు. అయితే, జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు సరైన నాయకత్వం కోసం వెతుకుతున్నటగా సైకిల్‌​ పార్టీ చెబుతున్నా.. ఏడాదిన్నర నుంచి అందుకు తగ్గ నేతలు దొరక్కపోవడం ఏమిటన్నది సందేహాస్పదం.

మరోవైపు స్థానిక ఎన్నికల కోసం కసరత్తు జరుగుతున్నప్పటికీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నాయకత్వం లేకపోవటం వల్ల నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నాయకత్వ ఎంపిక ఆలస్యమవుతన్న కొద్దీ పార్టీకి నష్టమే అని తెలిసినా చంద్రబాబు మిన్నకుండిపోవడం దారుణమని తెలుగు తమ్ముళ్ల నుంచి ఫిర్యాదు బలంగా వినిపిస్తోంది. పార్టీ బలంగా ఉండి.. మంచి కేడర్‌ ఉన్నప్పటికి వారిని నడిపించే స్థానిక నాయకత్వం లేకపోవడంపై చంద్రబాబుపై సొంత పార్టీలోనే అసహనం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముడు తోట త్రిమూర్తులు పార్టీని వదిలేశారు. అధికార వైసీపీ తీర్థం తీసుకున్న ఆయన ప్రస్తుతం పక్క నియోజకవర్గమైన మండపేటకు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

గతంలో ప్రజారాజ్యం సమయంలోనే ఓమారు సైకిల్ దిగేసిన ఆయన తర్వాత మళ్లీ పార్టీలో చేరారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి సైకిల్ దిగేసి తన దారిన తాను వెళ్లిపోయారు. ఇలా రెండు నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేక తెలుగుతమ్ముళ్లు డీలా పడిపోతున్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు ఇలాంటి సమస్యలను సీరియస్‌గా తీసుకొని సెట్ చేస్తే సరిపోయే దానికి.. నెలల తరబడి పెండింగ్‌ పెట్టడం ద్వారా సాధించేదేమీ ఉండదన్నది తెలుసుకోవాలి. ముఖ్యంగా యువ నాయకత్వానికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో ఇలాంటి ఇష్యూలకు చెక్ పెట్టటంతో ‘సైకిల్‌’ ను పరుగులు పెట్టించగలరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -