Thursday, April 25, 2024
- Advertisement -

టీపీసీసీ చీఫ్‌గా సీనియర్‌! బీజేపీలోకి రేవంత్‌!

- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌కు జ్ఞానోదయమైంది. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సేవలు చాలునని తెలుసుకుంది. మరోవైపు దుబ్బాకలో అనూహ్యం విజయం, గ్రేటర్‌ ఎన్నికల్లోనూ సత్తాచాటిన బీజేపీ టీఆర్‌ఎస్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించింది. దీంతో తెలంగాణలో పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం భారీ కసరత్తులు చేస్తోంది. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర రాజనరసింహ, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్యే పోటీ ఉండనుంది.

అయితే, రేవంత్‌రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపిస్తున్నా, పార్టీ సీనియర్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తుండటంతో ఎప్పటికప్పుడు తన నిర్ణయంపై వెనకడుగు వేస్తున్నట్టగా తెలుస్తోంది. మరోవైపు రాజకీయంగా ఓనమాలు దిద్దిన నాటి నుంచి పార్టీకి సేవలు చేస్తున్న తన అన్నకు కాకుండా నిన్నా, మొన్నా పార్టీలోకి వచ్చిన వారికి పీసీసీ పదవి కట్టబెడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇదివరకే అల్టిమేటం జారీ చేశారు. మరోమాట లేకుండా బీజేపీలోకి వెళ్తామని తేల్చి చెప్పారు.

సీనియర్‌కే బాధ్యతలు!
టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేసేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ పార్టీలోని నాయకులదరితో చర్చలు జరుపుతున్నారు. అయితే, సీనియర్‌ నేతల నుంచి అభ్యంతరాల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే పీసీసీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. మాణిక్కం ఠాకూర్‌తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎక్కువసార్లు చర్చల్లో పాల్గొనడంతో ఆయనే రాష్ట్ర కాంగ్రెస్‌ కొత్త సారధి అనే ప్రచారం ఊపందుకుంది. ఠాగూర్‌ శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయమై నివేదిక సమర్పించన్నారు. రేపు లేదా ఎల్లుండి పీసీసీ పదవిపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోనుంది.

అయితే, తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరిగి పూర్వ వైభవం తెచ్చే నేతగా ప్రచారంలో ఉన్న రేవంత్‌రెడ్డి పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో నిత్యం ఢీ అంటే ఢీ అంటూ నిరాశ నిస్పృహల్లో ఉన్న కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజం తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న రేవంత్‌కు ఇది భంగపాటుగానే చెప్పొచు​. ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా తననే నియమిస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్న ఆయన మరోదారి చూసుకునే అవకాలున్నాయి.

అధిష్టానం గనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపు మొగ్గు చూపితే, కాంగ్రెస్‌ తాను ఉన్నా ప్రయోజనం ఉండదని, ఇప్పటికే బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్న క్రమంలో ఆ పార్టీ లోకి వెళ్లి తన రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని రేవంత్ చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా టీపీసీసీ నూతన అద్యక్షుడి ఎంపికపై అధిష్టానం నిర్ణయం ఏమిటన్నది తేలిన తర్వాత కాంగ్రెస్‌ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. పార్టీలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -