Saturday, April 27, 2024
- Advertisement -

టీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించి నేటికి నెల రోజులు

- Advertisement -

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేసేసి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించేసి అప్పుడే నెల రోజులు అయిపోయింది. గత నెల 6వ తేదీన అటు అసెంబ్లీ రద్దు ఇటు అభ్యర్ధుల ప్రకటన ఒకే సారి చేసేసి కేసీఆర్ సంచలనం రేపారు. అందరూ ఆహా ఓహో అని కేసీఆర్ ను కొనియాడారు. దేశచరిత్రలో ఎప్పుడు ఏ నేతా ఇలా చేయలేదు. కేసీఆర్ గ్రేట్ అంటూ పొగిడేశారు. ఇక తమకు టికెట్ మళ్లీ ఖరారు చేయడంతో 105 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులు ఎగిరి గంతేశారు. టికెట్ వస్తుందో రాదో ? అనే టెన్షన్ లేకుండా సింగిల్ సిటింగ్ తో కేసీఆర్ తమ పేరు ప్రకటించేసరికి సగం టెన్షన్ తీరిపోయిందని, దాదాపు గెలిచేసినంత సంబరపడిపోయారు. మంచి ముహూర్తాలు చూసుకుని ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, సీపీఎం పొత్తుల పేరుతో కుప్పిగంతులు వేస్తుండటంతో వాళ్లు అభ్యర్ధులను ఖరారు చేసే లోపే తమ ప్రచారం కూడా పూర్తయిపోతుందని మురిసిపోయారు గులాబీ అభ్యర్ధులు. మహాకూటమి తరఫున ఎవరు పోటీ చేస్తారో ? ఏ నియోజకవర్గంలో అభ్యర్ధి ఎవరో తేలే లోపు తాము జనంలోకి వెళ్లిపోయి, తమ జెండా అజెండా చెప్పేసి ప్రచారం ముమ్మరం చేసుకుంటామని వాళ్లు పడ్డ సంబరం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.

అందరి కంటే ముందే అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించండతో ఆయా అభ్యర్ధులకు ఇప్పుడు ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. టికెట్ ఖరారు అయినప్పటి నుంచీ, ముహూర్తం చూసి ప్రచారం ప్రారంభించినప్పటి నుంచీ మంచినీళ్లలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని కక్కలేక మింగలేక టీఆర్ఎస్ అభ్యర్థులు లోలోపలే కుమిలిపోతున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, చుట్టాలు బంధువులు అంటూ వారి కోరికలు, సరదాలు, తీర్చడంతోనే తమకు ఈ నెల రోజుల్లోనే చుక్కలు కనిపిస్తున్నాయని, ఎలక్షన్ దగ్గర పడేసరికి ఇంకెంత పిండేస్తారో…! అని కలవరపడుతున్నారు. మీడియాను, సోషల్ మీడియాను మేనేజ్ చేయలేక, నియోజకవర్గాల వారీగా ప్రచారంలో వెనుకబడకూడదనే కసితో బాగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని గుబులు చెందుతున్నారు.

మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ అభ్యర్ధులను మార్చుతారని ప్రచారం జరుగుతోంది. బీ ఫామ్ వచ్చేంతవరకూ గ్యారెంటీ లేదని వస్తున్న వార్తలతో టీఆర్ఎస్ అభ్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే తాము అందరినీ బుజ్జగించుకుని, కాళ్లా వేళ్లా పడి బతిమాలుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చేతిచమురు బాగా వదిలించుకుంటున్నామని సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇంక నోటిఫికేషన్ వచ్చి, ఎన్నికల ప్రచారం ఊపందుకునేసరికి ఈ ఖర్చు ఊహకందని రీతిలో పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ ఖర్చు చేసి, కష్టపడ్డాక ఆఖరి నిముషంలో టికెట్ రాకపోతే, బీ ఫామ్ ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని బయటకు చెప్పలేక లోపల ఉండలేక కొందరు అభ్యర్ధులు సతమతమవుతున్నారు. కేసీఆర్ తొందరపడి అభ్యర్ధులను ప్రకటించేశారని తమలో తామే అభ్యర్ధులు ఓదార్చుకుంటూ రోజువారీ ఖర్చుల లెక్కలు చూసి కళ్లు తేలేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్ధులను ప్రకటించకపోవడంతో వారికి ఈ నెల రోజుల ఖర్చులు తప్పాయని, నోటిఫికేషన్ వచ్చాక ప్రకటిస్తే మరింత ఖర్చు తప్పుతుందని టీఆర్ఎస్ అభ్యర్ధులు అభిప్రాయపడుతున్నారు. ఖర్చుల లెక్క అంచనాలో కేసీఆర్ ప్లాన్ బెడిసి కొట్టిందని, ఎలక్షన్ టైంకి తమ నిధులన్నీ కరిగిపోయి కొంప కొల్లేరయిపోయేటట్టుందని బాధ పడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -