Friday, April 26, 2024
- Advertisement -

టిడిపి, ఎస్ఈసీకి, ఈనాడుకు మధ్య ఎంత చక్కటి కో ఆర్డినేషనో..!?

- Advertisement -

ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తూ, నీతి, న్యాయం అన్నది పాటించకుండా ఆ వ్యవస్థను ఎలా దిగజారుస్తున్నాడో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని గత కొంతకాలంగా చూస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉంటూ.. ప్రభుత్వాన్ని ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం అని, గూండాల ప్రభుత్వం అని ఆయన లేఖలు రాశాడంటే.. ఆయన ఏరకంగా పనిచేస్తున్నాడో సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోంది. నిమ్మగడ్డ రాసిన లేఖను, ప్రభుత్వంపై ఆయన చేసిన దారుణమైన విమర్శలను చూశాక కూడా ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు.. అని రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ ఏ ఒక్కరైనా అనుకుంటారా..?

రాజ్యాంగ పదవిని అడ్డం పెట్టుకుని గత కొద్ది నెలలుగా నిమ్మగడ్డ రమేష్ చేస్తున్న డ్రామాలు చూస్తున్నాం. వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్న దుర్మార్గాలను, కుట్రలను ప్రశ్నిస్తున్నాము తప్పితే, రాజ్యాంగ వ్యవస్థలను కించపరచాలన్న ఉద్దేశంగానీ, వ్యవస్థలను నాశనం కావాలని గానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కోరుకోదు. వ్యవస్థలను నాశనం చేయడం అంటే.. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, ఒక స్టార్ హోటల్ లో చంద్రబాబు ఆదేశాల మేరకు.. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లాంటి రాజకీయ నాయకులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం. అలానే రాజ్యాంగ పదవిలో ఉండి కోట్లాది రూపాయలు న్యాయవాదులకు వెచ్చించి, ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారో కూడా చెప్పకుండా దాచటం.

చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తదితరులతో కుమ్మక్కై వ్యవస్థలను ఎలా భ్రష్టుపట్టిస్తున్నారనడానికి ఉదారహణ చూస్తే.. ఈరోజు తెలుగుదేశం అనుకూల ఈనాడు పత్రికలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం- హైకోర్టుకు నివేదించిన ఎస్ఈసీ- అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు.. అంటూ ఫస్ట్ పేజీలో పెద్ద అక్షరాలతో రాశారు. వాస్తవానికి, ఆ రిట్ పిటీషన్ ఎప్పుడు ఫైల్ అయిందో చూస్తే.. నవంబరు 4, 2020న అంటే ఈరోజు ఎస్ఈసీ ఫైల్ చేసింది. ఏ పత్రిక అయినా ముందురోజు రాత్రి 10 గంటల వరకో, 11 గంటల వరకో వచ్చిన వార్తలను రాస్తుంది. ఈనాడు పత్రికలో మాత్రం ఈరోజు వేసిన రిట్.. నిన్న వేసినట్టు రావడం, ముందు రోజే లీక్ ఇవ్వడంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉన్న ప్రత్యేక ఇంట్రస్టు ఏమిటి..? దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి..? నిమ్మగడ్డ రమేష్ అత్యుత్సాహం ఏమిటి..?

ఇవన్నీ చూస్తే, తెలుగుదేశం పార్టీకి, ఎస్ఈసీకి, ఈనాడుకు మధ్య ఎంత చక్కటి కో ఆర్డినేషన్ ఉందో అనిపిస్తుంది. హైకోర్టుకు నివేదించే దానిని, ముందుగానే, ముందురోజే మీడియాకు ఎలా ఇచ్చాడు.? రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయవచ్చా..? రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించే వారు ఎవరైనా ఇలా చేస్తారా..? రాజ్యాంగ వ్యవస్థలంటే మీకున్న గౌరవం ఇదేనా?

వ్యవస్థలను సర్వ నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కూడా తాను రాజ్యాంగ పదవిలో ఉన్నానన్న విషయం మరిచిపోయి, ఇంకా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అని ఊహించుకున్నాడో, లేక ఆయన ఆదేశాల ప్రకారమే ఇదంతా చేస్తున్నాడో.. అన్నది రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణాలు చూస్తే అర్థమవుతుంది.

మేం సూటిగా ప్రశ్నిస్తున్నాంః మీ సొంత ప్రయోజనాల కోసం ఎందుకు వ్యవస్థల్ని తాకట్టు పెడుతున్నారు అని.? వ్యవస్థల్ని తాకట్టు పెడుతుంది మీరే అని ప్రజలకు అర్థం కావడం లేదా?

చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించిన సిస్టమ్ ను రిపేర్ చేసే కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటే.. వ్యవస్థలను అడ్డు పెట్టుకుని ఇంకా కుట్రలు చేస్తారా..?

రాజ్యాంగాన్ని గౌరవించే వారికి, ప్రజాస్వామ్యవాదులకు ఇది ఆందోళన కలిగించే అంశం కాదా..?

రాష్ట్రంలో మూడు కరోనా కేసులున్నప్పుడేమో ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించటం సాధ్యంకాదన్న నిమ్మగడ్డకు.. ఈరోజుకీ కూడా మూడు వేల కేసులు వస్తున్నప్పుడు ఎలా సాధ్యం అవుతుంది..? ఆయన దగ్గర ఏమన్నా మంత్ర దండం ఉందా.. ఆయన ఉఫ్ అంటే ఉఫ్.. తుఫ్ అంటే తుఫ్ అయిపోవడానికి..?. చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే ఇటువంటి వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తాడంటే.. రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతారా..?

నిమ్మగడ్డ రమేష్ ను ఇంతగా వెనకేసుకొచ్చి మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు, 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న గోపాలకృష్ణ దివ్వేదిని ఏ విధంగా బెదిరించారో వీడియో ద్వారా చూడండి. చంద్రబాబు చెరిపేస్తే, చెరిగిపోయే నిజాలు కాదు. వీడియోలు చూస్తే అర్థమవుతుంది, ఎవరు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు, ఎవరు రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్నవారిని బెదిరిస్తారో అన్నది. ఆరోజు సెంట్రల్ ఎన్నికల అధికారిగా ఉన్న దివ్యేదిని బెదిరించింది నిజం కాదా..? చంద్రబాబు, తన మాట వినకపోతే ఏరకంగా బెదిరిస్తాడో.. అదే తనకు అనుకూలంగా ఉంటే ఏ విధంగా వెనకేసుకొస్తున్నాడో చూస్తున్నాం. అత్యంత ప్రజాదరణతో 151 సీట్లతో గెలిచిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ఆరోజు ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నాడో చూశాం.

నోరు తెరిస్తే.. 40 ఏళ్ళ అనుభవం అంటాడు. రాజకీయాల్లో వ్యక్తులకు ఉండాల్సింది 40 ఇయర్స్ అనుభవం ఒక్కటే కాదు.. హుందాతనం ఉండాలి. ప్రజలకు మేలు చేయాలన్న స్వభావం ఉండాలి.

ఎన్నికలంటే ఆరోజుగానీ, ఈరోజుగానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అన్నివర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది. అటువంటిది ఎన్నికలంటే మాకు భయమెందుకు ఉంటుంది..? స్థానిక ఎన్నికల్లో విజయం అన్నది మాకు నల్లేరు మీద నడక లాంటిది. అయితే చంద్రబాబు నాయుడు లాంటి స్వార్థపూరితమైన వ్యక్తితో కలిసి, ఎన్నికల కమిషనర్ చేసే పనులనే మేం ప్రశ్నిస్తున్నాం. రెండు, మూడు కరోనా కేసులు ఉన్నప్పుడు ఉద్యోగులు భద్రత ఏమవుతుందని ప్రశ్నించిన నిమ్మగడ్డకు.. ఈరోజు ఒకవైపు ఉద్యోగులు కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు అంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు..? మరోవైపు తనకున్న అధికారాల పేరుతో నిజాయితీగా పనిచేసిన అధికారులను ట్రాన్స్ ఫర్ చేసి, చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికలను నిర్వహించాలని మీరు చూస్తున్నారా..? అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

ఇన్ని దుర్మా్ర్గాలు చేస్తూ కూడా, పొద్దున లేచిన దగ్గర నుంచి జూమ్ కెమెరా ముందుకు వచ్చి నీతులు చెప్పే చంద్రబాబు గారు సిగ్గు పడాలి. తన స్వార్థం కోసం చంద్రబాబు ఎందుకు ఇలా వ్యవస్థలను నాశనం చేస్తున్నాడో ప్రజలు కూడా ఆలోచించాలి. “మూసేసిన పార్టీ-ఇంట్లో నుంచి గడప దాటని నాయకుడు చంద్రబాబు నాయుడు”… జూమ్ మీటింగ్ లు పెట్టి ప్రభుత్వంపై పదే పదే బురదచల్లుతాడు. “నేను అయితే అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని.. ” అంటూ ముంబై ఐఐటీ విద్యార్థులతో, మేధావుల పేరుతో, వైద్యుల పేరుతో ఇంట్లో కూర్చుని బురదచల్లే కార్యక్రమం తప్ప, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అసలు రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు?

మరోవైపు వరి పొలాలకు, చెరువులకు తేడా తెలియని తన కొడుకుని పంపించి అతనితో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడిస్తాడు.

అమరావతిని డల్లాస్, సింగపూర్, ఖజికిస్తాన్, జపాన్, టోక్యో.. చేస్తాను అని ప్రపంచంలో ఉన్న పేర్లు అన్నీ నాడు చంద్రబాబు చెప్పాడు. ఆకాశంలో కూలర్లు పెట్టి అమరావతిలో టెంపరేజర్ తగ్గిస్తానని కూడా చెప్పాడు. చివరికి వైయస్ఆర్ గారి హయాంలో నిర్మించిన బుద్ధుడి విగ్రహం చూపిస్తూ, చ.అడుగుకి రూ. 12 వేలు ఖర్చు చేసి నాలుగు టెంపరెరీ బిల్డింగులు కట్టి దోచుకున్నారు. అమరావతిలో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ ఉంది.? కనీసం కనకదుర్గమ్మ వారధిని కూడా పూర్తి చేయని చంద్రబాబు.. అమరావతి కట్టాడంటే ఎవరైనా నమ్ముతారా.. ? కాంట్రాక్టులు, కమీషన్ల కోసం కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టు కట్టిందిలేదు గానీ, పోలవరం సందర్శకుల కోసం బస్సులు వేసి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టాడు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా బలితీసుకున్నాడో అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పేరుతో దోపిడీ చేయడమే.

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ మాదిరిగా మార్చుకుని దోచుకున్నాడని సాక్షాత్తూ ప్రధానే అన్నారు. జగన్ గారు అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ వల్ల ఆలస్యం అవుతుందని సిగ్గులేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల రూ. 800 కోట్లు ప్రజల డబ్బును ఆదా చేస్తే ఆలస్యమనడానికి నోరు ఎలా వచ్చింది.?

సంక్రాంతికి టిడ్కో ఇళ్ళు స్వాధీనం చేసుకోండి.. అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. ఇదేమైనా తెలుగుదేశం పార్టీనా.. అక్రమంగానో, వెన్నుపోటు ద్వారానో స్వాధీనం చేసుకోవడానికి..?

అగ్గి పెట్టెల్లాంటి ఇళ్ళు కట్టి, రూ. 3200 కోట్లు బాకీ పెట్టి గద్దె దిగిపోయి, 300 చ. అడుగులు ఇళ్ళ పేరుతో పేదలపై రూ. 3 లక్షలు అప్పు పెట్టి, ఈరోజు తానేదో టిడ్కో ఇళ్ళు కట్టినట్టు బిల్డప్పా..?

ఈ ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే..కోర్టులకు వెళ్ళి అడ్డుకుని రెండు వేల ఎకరాల్లోనే అడ్డుకున్నామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. హైకోర్టు ఆర్డర్ రాష్ట్రంలో అన్ని ఇళ్ళ పట్టాల మీద ఇస్తే, రెండు వేల ఎకరాలే అని చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇన్ని చేసిన చంద్రబాబుకు హౌసింగ్ గురించి మాట్లాడటానికి ఏం హక్కు ఉంది.? గృహ ప్రవేశం అంటే మంగళవాయిద్యాలతో వెళ్ళాలి తప్పితే, చొచ్చుకుపోండి.. ఆక్రమించుకోండి.. అని మాట్లాడితే ప్రజలు ఊరుకోరు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం ఎంతో విజయవంతమవుతోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. నాడు-నేడు కింద ఆసుపత్రులు, ప్రభుత్వ స్కూళ్ళును కొన్ని వందల కోట్లతో అభివృద్ధి చేస్తుంటే, కార్పొరేట్ కు దీటుగా వాటిని తీర్చిదిద్దుతుంటే.. ఇవేవీ చంద్రబాబు కళ్ళకు కనిపించడం లేదా..? రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాపింగ్, మార్కెటింగ్, ఎరువులు, విత్తనాలు ఇన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినా.. వీటి గురించి ఒక్క మంచి మాట చెప్పేందు బాబుకు నోరు రావడంలేదు. సినిమాలో చెప్పినట్టు “ఏమో సార్ నాకు కనపడదు..” అన్నట్టు చంద్రబాబు కళ్ళు బైర్లు కమ్మాయి.

ఈరోజు రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎటువంటి ఢోకా లేదు. రాష్ట్రంలో తప్పు చేసిన వాడు ఏ పార్టీ వాడైనా శిక్షించమని సీఎం జగన్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు హయాంలో విజయవాడ నడిబొడ్డున కాల్ మనీ పేరుతో జరిగిన అరాచకాలను చూసీచూడనట్టు వదిలేస్తే.. ఆరోజు అంతా ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపించారు. తన మాదిరిగానే అందరూ ఉంటారనుకుంటారో ఏమోగానీ, చంద్రబాబు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు. కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టే చంద్రబాబు, ఆఖరికి ఎస్సీల మధ్య, బీసీల మద్య తగాదాలు పెట్టిన చరిత్ర కూడా ఆయనదే. ఓటు బ్యాంకు కోసం ఎంత నీచానికైనా దిగజారే మనస్తత్వం చంద్రబాబుది. ఎవరి హయాంలో ఏం జరిగిందో.. అన్న దానిపై వాస్తవాలు చర్చించడానికి ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం.

దుర్మార్గమైన ఆలోచనలతో వ్యవస్థలను మేనేజ్ చేయాలన్న చంద్రబాబు ఆలోచనలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు.. సొంత ఇంట్రస్టులను తీసుకురాకుండా.. ఆ వ్యవస్థల గౌరవాన్ని పెంచండి అని కోరుతున్నాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -