జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ని చూసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గజగజ వణుకుతున్నారని ఎద్దేవ చేశారు. తాత ముఖ్యమంత్రిగా చేసినా, తండ్రి ముఖ్యమంత్రి అయినా ఆయన అధికారులతో గానీ, కార్యకర్తలతో గానీ ఎంతో హుందాగా వ్యవహరిస్తారన్నారు.
సీఎం అవడానికి ఎందుకు అంత తొందర, మీ తాత ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసులో సీఎం అయ్యారని లోకేష్ ని పవన్ అంటున్నారని, అసలు లోకేష్ సీఎం కావాలనుకుంటున్నట్లు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. లోకేష్ కు సంబంధించి చేస్తున్న వితండవాదాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.
సీఎం పదవి అంటే వడ్డించిన విస్తరికాదని, ఉర్రూతలూగించే ప్రసంగాలు, ఆవేశంతో ఊగిపోవడం కాదన్నారు. చంద్రబాబు, జగన్, పవన్ లలో ఎవరిని సీఎం చేస్తారని అడుగుతున్నారని, ఎవరిని సీఎం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. సమాజంపైన, భారతీయ సంస్కృతిపైన, కుటుంబ వ్యవస్థపైన, పెళ్లిళ్లపైన పవన్ కు అవగాహన లేదన్నారు.
ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. చంద్రబాబు యూ టర్న్ తీసుకోలేదని, మోదీ తీసుకున్నారన్నారు. పార్లమెంటులో అవిశ్వాసం సందర్భంగా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఆయన అన్న చిరంజీవి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎన్నికల సమయంలో అల్లు అరవింద్ పోటీ అభ్యర్థుల నుంచి పొలాలు, స్థలాలు, ఇళ్లు రాయించుకొని రాజకీయాలను కలుషితం చేశారన్నారు.
పవన్ ఒక్కోసారి తనకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే చాలంటారు, అంటే అన్న 18 మంది ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి పదవి చేపట్టినట్లు తను కూడా సీఎం అవవచ్చని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆయన మాటలు పొంతనలేని విధంగా ఉంటాయన్నారు. జనసేన ప్రజా రాజ్యం-2గా లేక ఆ పార్టీ అవశేషంగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. పవన్ కు దగ్గరగా ఉన్న లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ, కమ్యునిస్టులు ఒక్కొక్కరుగా అతనిని వదిలివేశారని చెప్పారు.
2019 ఎన్నికల్లో మీ రంగు బయట పడుతుందని, ప్రజాక్షేత్రంలో సమాధానం చెబుతామని అన్నారు. పిడికిలి ఐక్యతకు చిహ్నం కాదని, తిరుగుబాటుకు గుర్తు అని స్పష్టం చేశారు.
