Saturday, April 27, 2024
- Advertisement -

కేసీఆర్ తిట్ల పురాణంపై టీఆర్ఎస్ అభ్యర్ధుల్లో టెన్షన్

- Advertisement -

చంద్రబాబునాయుడు దుర్మార్గుడు. వైఎస్ఆర్ దుర్మార్గుడు. వాళ్లిద్దరూ తెలంగాణ ద్రోహులు. ప్రాజెక్టులు అడ్డుకున్నారు. తెలంగాణను తొక్కేశారు. ఉద్యమాన్ని అణిచేశారు. చంద్రబాబుకి తెలంగాణ టీడీపీ నేతలు ఊడిగం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్ కు అమ్ముడు పోయారు. తెలంగాణ ఉద్యమం నుంచీ నేటి వరకూ కేసీఆర్ చేస్తున్న ఆరోపణలు ఇవి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కూడా ఇదే తీరు. చంద్రబాబుని, వైఎస్ఆర్ ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టడం. వాళ్లిద్దర్నీ ఎంత తిడితే అన్ని ఓట్లు తమకు పడతాయని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ వైఎస్ఆర్, చంద్రబాబుకి తెలంగాణలో పెద్దఎత్తున అభిమానులున్నారని మరిచిపోతున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లోనూ చంద్రబాబు, వైఎస్ఆర్ పై విమర్శలకే కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సెటిలర్లు, సీమాంధ్రవాసులు అధికంగా ఉన్న హైదరాబాద్ లో వారి ఓట్లు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గెలుపోటములను నిర్ణయించేది సీమాంధ్రులే. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్భుల్లాపూర్, ఖైరతాబాద్, ఉప్పల్, ఎల్ బీ నగర్, రంగారెడ్డి, మెదక్ సహా 10 నుంచి 15 నియోజకవర్గాల్లో వారి ప్రభావం గట్టిగా ఉంటుంది. జీహెచ్ ఎంసీ పరిధిలో సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో వాళ్లు ఎటు మొగ్గు చూపితే అటే విజయం వరిస్తుంది.

అయితే కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ఈ నాలుగేళ్లలో తానేం చేశాడో ? ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చాడో ? చెప్పడం కంటే చంద్రబాబు మీద విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. వచ్చేసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ? తమ పార్టీ మ్యానిఫెస్టోలో ఏఏ హామీలు ఉండబోతున్నాయో చెప్పడం కంటే వైఎస్ఆర్ మీద తిట్ల దండకం చెప్పడానికే సమయం కేటాయిస్తున్నాడు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్ధుల్లో కొంత కలవరం మొదలైంది. ఆంధ్రా రాయలసీమ ప్రాంతాలకు చెందిన సెటిలర్లకు ఏం చేస్తారో చెప్పడం లేదు. గతంలో వారి కోసం గొంగలిపురుగును ముద్దాడుతా.. వారి కాలికి ముల్లు గుచ్చితే నా పంటితో తీస్తా…అంటూ పంచ్ డైలాగులు చెప్పిన కేసీఆర్ మాటలు నమ్మి సెటిలర్లు టీఆర్ఎస్ కు పట్టం కట్టారు. ఈ సారి వారికి స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదు. గత నాలుగేళ్లలో తెలంగాణలో సెటిలైన సీమాంధ్రులకు ఏం చేశారో కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ సారి ఏం చేస్తారో కూడా హామీ ఇవ్వలేకపోతున్నారు. దీనికి తోడు తమ ప్రాంత నాయకులైన వైఎస్ఆర్, చంద్రబాబును పదే పదే తిట్టడంపై సెటిలర్లు రగిలిపోతున్నారు. నీ ఏడుపేదో నువ్వు ఏడవకుండా మళ్లీ రెండు రాష్ట్రాల ప్రజల చిచ్చు పెట్టి, మనోభావాలు రెచ్చగొట్టేలా మా ప్రాంత నాయకులు దొంగలు, ద్రోహులు అని నోరు పారేసుకోవడం ఏంటని ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ లేవదీశారు. దీంతో సెటిలర్లు ఎక్కువ ప్రభావం చూపే నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ తీరు మారకపోతే వాళ్లంతా మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్, టీడీపీకి ఓట్లు వేయడం ఖాయమని భయపడుతున్నారు. పోనీ తమ మాటగా కేసీఆర్ కు చెప్పుకుందామన్నా ఆయన వినే మనిషి కాడని దేవుడిపై భారమేసి ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడం ఎలా ? అని తలలు పట్టుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -