Saturday, April 20, 2024
- Advertisement -

ఆంధ్రాలో కాంగ్రెస్‌ను తొక్కేసి పైకొచ్చిన‌ బీజేపీ

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు చాలా తెలివైన‌వాళ్లు. వాళ్ల‌కు ఎప్పుడు ఎవ‌రిని పైకి తేవాలో.. ఎవ‌రిని తొక్కాలో బాగా తెలుసు. త‌మ అవ‌స‌రానికి.. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా అంతా ఒక్క‌టైపోయి ఓటింగ్ వేస్తుంటారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప‌రిస్థితి చూసే వారికెవ‌రికైనా ఇదే విష‌యం అర్థ‌మ‌వుతుంది. కాంగ్రెస్‌కు తెలంగాణ‌లో కంటే ఏపీలో బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది.. సారీ.. ఉండేది. కానీ.. ఒక్క పొర‌పాటుతో కాంగ్రెస్‌ను పాతాళంలోనికి తొక్కేశారు.

తెలంగాణ ఇస్తే.. ఆంధ్రుల ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న‌కు స‌రిగా స‌మాధానం చెప్ప‌కపోగా, పార్ల‌మెంట్ త‌లుపులు మూసేసి మ‌రీ రాష్ర్టాన్ని విడ‌గొట్టార‌నే భావ‌న ఆంధ్రుల్లో నాటుకుపోయింది. అందుకే.. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అంత‌కుముంద‌టి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు అధికారం కట్ట‌బెట్టిన జ‌నం.. అంతే క‌సిగా కాంగ్రెస్ విష‌యంలో త‌మ తీర్పును చెప్పారు. క‌నీసం డిపాజిట్లు సైతం ఆ పార్టీ నాయ‌కులు ద‌క్కించుకోలేక‌పోయారు. ఇంక కాంగ్రెస్ ప‌నైపోయింద‌ని భావించి.. పురంధ‌రేశ్వ‌రి, జేసీ దివాక‌ర్‌రెడ్డి లాంటి కురువృద్దులైన వాళ్లు సైతం పార్టీని వీడారు.

కాంగ్రెస్ ప‌రిస్థితి రాష్ట్రంలో ఎలా మారిందంటే.. ఒక్క గ్రామ‌స్థాయి ప్రెసిడెంట్ కూడా ఆ పార్టీకి లేకుండా తొక్క‌శారు. ఆ స‌మ‌యంలోనే మోడీ వచ్చి వారు విడ‌గొడితే.. నేను ఆదుకుంటానంటూ భ‌రోసా ఇచ్చాడు. తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ప్ర‌మాణం చేసి వెళ్లాడు. నిజ‌మ‌ని న‌మ్మి.. అత‌నికి ప‌ట్టం క‌ట్టారు. కానీ.. గ‌ద్దెనెక్కిన నుంచి రాష్ట్రానికి న్యాయం రావాల్సిన దానిలో ప‌ది శాతం కూడా ఇప్ప‌టివ‌ర‌కూ ఇవ్వ‌లేదు. అదేమంటే.. చంద్ర‌బాబుపై గ‌తంలో తాను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పటి నుంచే ప‌గుందంట‌. విన‌డానికే ప‌ర‌మ అస‌హ్యంగా ఉందీ మాట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి వాళ్లు బ‌హిరంగ వేదిక‌ల‌పైనే బీజేపీ మ‌న‌సులోని మాట‌ను త‌మ నోటితో చెప్పారు. చంద్ర‌బాబుతో మోడీకి ఏదో గొడ‌వ ఉన్న‌ట్టుంది.. అందుకే ఇవ్వ‌డం లేదంటూ ప‌వ‌న్ చాలా వేదిక‌ల‌పై చెప్పాడు. ఇదెంత సిగ్గు చేటు. చంద్ర‌బాబుపై మోడీకి ప‌గుంటే ఉండ‌నీ.. దాని ప్ర‌భావం ఆరు కోట్ల మంది ఉన్న ఓ రాష్ట్రంపై ఎలా చూపిస్తాడు.

మోడీ ఇప్పుడు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి కాదు.. భార‌త‌దేశ ప్ర‌ధాని. ప‌క్ష‌పాతం రాగ‌ద్వేషాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాలి. కానీ.. ఏం చేశాడు. ఏపీని ముంచేశాడు. అందుకే.. ఇప్పుడు ఆంధ్రుల మ‌నసులో ఒక‌టే ఉంది. మోడీ జ‌పం త‌ప్ప మ‌రేం లేదు. కాంగ్రెస్ చేసిన ద్రోహం సైతం మోడీ చేసిన మోసం కంటే పెద్ద త‌ప్పు కాద‌నే ధోర‌ణి అంద‌రిలోనూ వ‌చ్చేసింది. గుజ‌రాత్‌లో క‌ట్టుకుంటున్న దోలెరా, గిఫ్ట్ సిటీల‌ను ల‌క్ష‌ల కోట్లు పెట్టి కట్టుకుంటున్న మోడీకి.. ఆంధ్రుల‌కు ఓ రాజ‌ధాని లేద‌నే ఇంగిత జ్ఞానం కూడా లేకుండాపోయింది. ఇదే ఇప్పుడు ఆంధ్రుల గుండెల‌ను ర‌గిలిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఇచ్చిన స్థానం ఇప్పుడు బీజేపీకి ఇచ్చేశారు. ఆంధ్రులు ఇచ్చార‌నే కంటే.. కాంగ్రెస్‌ను ఈ విష‌యంలో తొక్కేసి.. బీజేపీ పైకొచ్చి.. ఆంధ్రుల గుండెల్లో కోపాగ్నిని ర‌గిలిస్తోందంఏ బాగుంటుందేమో. మోడీ ప్ర‌భుత్వం చూపుతున్న నెపం ఏదైనా కానీ.. అంతిమంగా అన్యాయం జ‌రిగింది మాత్రం ఆంధ్రుడికే. అందుకే.. ఈసారి మీ రుణం తీర్చుకుంటాం మోడీజీ.. అంటూ మ‌న‌సుల్లో ప్ర‌తిన‌బూనుతున్నారు. క‌నీసం ఇప్పటికైనా.. మోడీ అండ్ కో క‌ళ్లు తెరిచి.. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం విష‌యంలో న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తే ఎన్నిక‌ల్లోగా.. తెలుగోడి మ‌న‌సు కొంతైనా మారొచ్చేమో.

ఆ దిశ‌గా బీజేపీ శ్రేణులు ప్ర‌య‌త్నిస్తే మంచిది. లేదంటే.. కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయిన అనేక రాజ‌కీయ పార్టీల్లాగే బీజేపీ కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పూర్తిగా క‌నుమ‌రుగైపోవ‌డం ఖాయం. దేశంలోనూ మోడీకి వ్యతిరేక ప‌వ‌నాలు బ‌లంగా వీస్తున్నాయి. వ‌చ్చేసారి మ‌ళ్లీ బీజేపీ గెలుస్తుంద‌నే న‌మ్మ‌క‌మూ లేదు. కాంగ్రెస్ వ‌స్తే.. ఎలాగూ త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌నే ఆశ ఆంధ్రుల్లో ఉంది. అదే నిజ‌మైతే.. కాంగ్రెస్‌కు పున‌ర్వైభ‌వం రావ‌డం కూడా ఖాయ‌మే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -