వైఎస్ఆర్ కాంగ్రెస్ ను మరింత బలపరుచుకోవాల్సిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వచ్చిన అవకాశాలను వదులుకుంటున్నారు. ముందు తన పార్టీ బలపడితే తర్వాత, తన రహస్యమిత్రులను, బలపర్చుకోవచ్చు. కానీ స్ట్రాంగ్ వాయిస్, ప్రభుత్వంలో దశాబ్దాల అనుభవం, చంద్రబాబు ఆలోచనలు దగ్గరగా చూసిన వ్యక్తులను ఆయన కావాలనే వదిలేసుకుంటున్నారు. తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లి, నోవాటెల్ హోటల్ లో శనివారం రాత్రి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఓకే ఆయన రాజకీయ భవిష్యత్ బాగుండాలని అందరం కోరుకుందాం. అందులో ఎలాంటి అభ్యంతరం ఎవరికీ లేదు. కానీ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వంలో ఎన్నో కష్టనష్టాలు, అవకతవకలు, లోటుపాట్లు, ముఖ్యంగా చంద్రబాబు మనస్తత్వాన్ని, అత్యంత కీలక సందర్భాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలను, ఎత్తుగడలను, పరిపాలనా పరంగా అనుసరించిన వ్యూహాలను, రాజధాని భూముల వ్యవహారంలోని లొసుగులు, ఉప ఎన్నికల వేళ ప్రభుత్వపరంగా అనుసరించిన వ్యూహాలు, వివిధ స్కామ్ లు స్కీమ్ లు…ఇలా అనేక అంశాలను దగ్గరగా చూసిన వ్యక్తి ఐవైఆర్. సీఎస్ బాధ్యతల అనంతరం చేపట్టిన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో టీడీపీ నేతల అవినీతిని భరించలేక, వారికి తలొగ్గలేక ఆ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబుని, టీడీపీ ప్రభుత్వంలోని అవినీతి ఎండగడుతూ ఉన్నారు. అలాంటి ఐవైఆర్ ను జగన్ తన పార్టీలో ఎందుకు చేర్చుకోలేకపోయారు ? బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లును ఎందుకు ఆకర్షించలేకపోయారు ? ఐవైఆర్ బీజేపీలో చేరతారని తెలిసినా, ఆయన్ను ఆపి తమ పార్టీలో చేర్చుకోలేకపోవడం జగన్ వైఫల్యమే.
కొద్దిరోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ కూడా వైఎస్ఆర్ సీపీలో చేరబోయి, ఆఖరి నిముషంలో అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరి, హైడ్రామా నడిపించి, చివరికి ఏపీ బీజేపీ పదవి ఇస్తామనడంతో ఆ పార్టీలో చేరిపోయారు. అమరావతి ప్రాంతంలో కాపు సామాజికవర్గం నాయకుడిగా ఓ నాలుగైదు నియోజకవర్గాల్లో కన్నాకు గట్టి పట్టుంది. అలాంటి నాయకుడు వైఎస్ఆర్ సీపీలో చేరితే కచ్చితంగా ఆ పార్టీకి లాభమే. కానీ బీజేపీ పెద్దలతో రహస్యస్నేహం వల్ల, కన్నాను బీజేపీకే త్యాగం చేశారు జగన్.
కన్నా లక్ష్మీనారాయణ, ఐవైఆర్ కృష్ణారావు ఇద్దరూ వైఎస్ఆర్ సీపీలో చేరడానికి ప్లాన్ చేసుకున్నవారే. వారి చేరికతో ఆ పార్టీకి లాభమే తప్ప నష్టం లేదు. కానీ జగన్ బీజేపీ నేతల ఒత్తిడికి తలొగ్గి, ఆ పార్టీలో చేరేలా సైలెంట్ అయిపోయారు. ఈ లోపాయికారి ఒప్పందం వల్ల నష్టపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఎంత రహస్య స్నేహం బీజేపీతో ఉన్నా…తమ పార్టీలో చేరాల్సిన, కచ్చితంగా చేర్చుకోవాల్సిన బలమైన వ్యక్తులను జగన్ వదులుకోవడం ఎంతమాత్రం ఆయన పార్టీ మనుగడకు మేలు చేయదు. బీజేపీ అంత నమ్మకమైన మిత్రపార్టీ కాదు…. అనేది ఇప్పటికే టీడీపీ విషయంలో నిరూపణ అయింది. దశాబ్దాలుగా ఎన్టీఏ కూటమితో ఆ పార్టీకి మితృత్వం ఉంది. కానీ ఆ పార్టీనే మోడీ, అమిత్ షా వాడుకుని వదిలేశారు. వాళ్లిద్దరూ ఒక్క టీడీపీ విషయంలోనే కాదు ఏ పార్టీ విషయంలో అయినా అలాగే వ్యవహరిస్తారు. మిత్రధర్మాన్ని ఏమాత్రం పాటించరు. అలాంటి వారి పార్టీ బలపడితే రేపు జగన్ కు సాయం చేస్తారని నమ్మకం ఏంటి ? జగన్ పార్టీలో చేరాలనుకునే వారిని బలవంతంగా బీజేపీలో చేర్చేస్తే రేపు బీజేపీ పెద్దలు జగన్ పార్టీకి మేలు చేస్తారన్నది ఎంతవరకూ నమ్మవచ్చు. ముందు ముందు మరిందరు ఏపీకి చెందిన నాయకులు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. బీజేపీ పేరు చెబితేనే ఏపీలో జనం ఒంటికాలి మీద లేస్తున్నారు. ఎవరైనా చేరాలనుకుంటే బలంగా ఉన్న వైఎస్ఆర్ సీపీలో చేరుతారు కానీ, బలహీనపడిన బీజేపీలో చేరాలనుకోరు. కానీ జగన్ వారిని ఎలాగోలా నచ్చచెప్పి బీజేపీ కండువా కప్పుకునేలా చేస్తారు. కన్నా, ఐవైఆర్ విషయంలో చేసినట్లే. కానీ జగన్ ముందు ఎంతవరకూ తన పార్టీ బలపడగలదో అంతవరకూ బలపర్చుకుని, ముందు అధికారం దక్కించుకుంటే, తర్వాత బీజేపీతో స్నేహం సంగతి. అంతేకానీ ముందే తమ పార్టీ తీర్ధం పుచ్చుకోవాల్సిన నేతలను, మాజీ సీనియర్ అధకారులను తానే రూటు మార్చి పంపేస్తే తర్వాత ఫలితాలు తారుమారైతే బాధ పడి ప్రయోజనం ఉండదు. చంద్రబాబు అయితే ఏదైనా గ్రామంలో ఓ వార్డ్ మెంబర్ పార్టీ మారతాడని తెలిసినా ఆపేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేస్తారు. కానీ జగన్ ఇలా బలమైన వ్యక్తులను వదులుకోవడం మాత్రం ఆయనకే నష్టం.
