Tuesday, April 23, 2024
- Advertisement -

జగన్ ని పవన్‌ టార్గెట్ చేస్తున్నాడా? లేక జగనే పవన్‌ని టార్గెట్ చేస్తున్నాడా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని కావాలనే జగన్ టార్గెట్ చేస్తున్నాడా? పవన్‌ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడం కోసం వ్యూహాలు రచిస్తున్నాడా? జనసేన పార్టీ తనకు పోటీ అవుతుందన్న ఉద్ధేశ్యంతో జగన్ ఉన్నాడా? మూడు రోజుల పాటు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత నుంచీ మీడియాలో ఈ తరహా రాతలు ఓ స్థాయిలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు వర్సెస్ జగన్ వార్తలు పక్కకుపోయి పవన్ వర్సెస్ జగన్ వార్తలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఎల్లో మీడియా మొత్తం పవన్‌ని దెబ్బకొట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని, పవన్‌ని జగన్ టార్గెట్ చేస్తున్నాడని వార్తలు రాయడం, చర్చలు నడపడం చేస్తూ ఉన్నాయి. నిజానికి మీడియాను అడ్డుపెట్టుకుని బాబు అండ్ కో అందరూ కూడా జగన్‌ని కుట్రదారుడిగానూ, కడప ఫ్యాక్షనిస్ట్‌గానూ చిత్రిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఎల్లో మీడియా మొత్తం అదే ప్రయత్నం చేస్తూ ఉంది. పవన్‌ని టార్గెట్ చేస్తూ జగన్ ఏదో చేస్తున్నాడన్న కలర్ ఇస్తున్నాయి. అలాంటి ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కాపులను జగన్‌కి పూర్తిగా దూరం చేయాలన్నది అసలు లక్ష్యం. ఎల్లో మీడియాతో పాటు టిడిపి ప్రచారం చేస్తున్నట్టుగా నిజంగా పవన్‌ని టార్గెట్ చేస్తున్నాడా జగన్?

2014లో పవన్ పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నప్పుడు కానీ పవన్‌ని అస్సలు పట్టించుకోలేదు జగన్. కనీస మాత్రంగా కూడా పవన్ గురించి జగన్ మాట్లాడింది ఎప్పుడూ లేదు. ఇక ఆ తర్వత నుంచీ మాత్రం పవన్ గురించి మాట్లాడుతున్నాడు జగన్. అది కూడా చంద్రబాబు, మోడీలను గెలిపించమని, వాళ్ళు ఇచ్చిన హామీలకు నాదీ పూచీ అని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేశావు కదా…….ఇప్పుడు వాళ్ళు హామీలు నెరవేర్చలేదు కాబట్టి వచ్చి ప్రజల తరపున పోరాడమని పవన్‌ని అడుగుతున్నాడు జగన్. చంద్రబాబు భజన వదిలిపెట్టి ప్రజల కోసం పోరాటం చేయమంటున్నాడు జగన్. అంతకుమించి పవన్ వ్యక్తిత్వం గురించి కానీ, పవన్ రాజకీయ వ్యవహారాల గురించి జగన్ ఎప్పుడూ మాట్లాడింది లేదు.

ఇక పవన్ విషయానికి వస్తే పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచీ ఈ రోజు వరకూ కూడా పవన్ టార్గెట్ చేస్తోంది జగన్‌నే. ఓటుకు నోటు కేసుతో సహా బాబుపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడితే ఎవ్వరూ నమ్మే అవకాశం లేదు. ఇక ఎల్లో మీడియా అసలు రంగులు కూడా 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ జనాలకు బాగానే అర్థమవుతున్నాయి. అందుకే పవన్‌ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు. పవన్ కూడా చంద్రబాబు కోసం రాజకీయం చేస్తూ జగన్‌ని టార్గెట్ చేస్తున్నాడు. తన సినిమాల షూటింగ్‌కి గ్యాప్ వచ్చిన టైంలో మూడు రోజుల పాటు ప్రజల ముందు షో చేయడానికి వచ్చిన పవన్……చంద్రబాబును నిలదీస్తాడేమో, పడవ ప్రమాదంతో సహా చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల గురించి మాట్లాడతాడేమో అని ప్రజలు ఆశించారు. ప్రజల కోసం పోరాడాతాను, ప్రశ్నిస్తాను అని చెప్పే ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నవాళ్ళనే విమర్శిస్తాడు. కానీ పవన్ మాత్రం విచిత్రంగా అన్ని సమస్యలకూ జగన్ కారణమన్నట్టుగా మాట్లాడాడు. జగన్‌కి పోరాటం చేయడం చేతకాకపోవడం వళ్ళే చంద్రబాబు ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదు అన్న స్థాయిలో విచిత్రమైన వాదనలు వినిపించాడు పవన్. ఈ సమాజం ఎటు పోతోంది? ప్రజల కష్టాలు, కన్నీళ్ళు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అంటూ కాసేపు డ్రమెటిక్ సెంటిమెంట్ డైలాగులు కొట్టిన పవన్ చివరకు వచ్చేసరికి మాత్రం ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ని విమర్శించడాన్ని చూసి ఆలోచనాపరులందరూ ముక్కున వేలేసుకున్నారు. ఔరా ……ఎంత చంద్రబాబు జేబులో బొమ్మ అయితే మాత్రం మరీ ఈ స్థాయిలో దిగజారాలా? ప్రజల కోసం ప్రశ్నిస్తానంటూ మాటలు చెప్తూ చంద్రబాబు కోసం పనిచేస్తూ ఆ ప్రజలనే దగా చేయాలా? చంద్రబాబు వైఫల్యాలు ఎక్కడ జగన్‌కి ప్లస్ అవుతాయో అని చెప్పి జగన్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయాలా? అని పవన్ షో గురించి సెటైర్స్ వేశారు.

అయినప్పటికీ జగన్ మాత్రం ఎక్కడా కూడా పవన్‌ని టార్గెట్ చేయలేదు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అసలు పవన్‌ని పట్టించుకోలేదు జగన్. అయినప్పటికీ ఎల్లో మీడియా మాత్రం పవన్ మైనస్‌లను కవర్ చేయడానికి జగన్‌ని కుట్రదారుడిగా చూపించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు జనసేన కార్యాలయం కోసం కబ్జా స్థలం అన్న వార్తలను కూడా జగన్‌కే ఆపాదిస్తున్నారు. మా స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారు అని మైనారిటీ వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆవేధన వ్యక్తం చేశారు. స్థలం పేపర్స్ కూడా చూపించారు. వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని సాక్ష్యాధారాలతో చూపించారు. ఆ తర్వాత పవన్ కూడా తనకు తెలియకుండా జరిగిందన్నట్టుగా వివరణ ఇచ్చాడు. అలాంటి తప్పిదం జరిగి ఉంటే ఆ స్థలాన్ని వదులుకోవడానికి రెడీ అని వివరణ ఇచ్చాడు. అయితే ఎల్లో మీడియాతో సహా, సోషల్ మీడియాలో ఉన్న పవన్ ప్రచారకర్తలు మాత్రం ఈ ఇష్యూలోకి జగన్‌ని లాగుతున్నారు. జనసేన జనాలు ప్రత్యేకంగా ఉన్నారో లేక అందరూ టిడిపి జనాలేమో తెలియదు కానీ అందరూ కూడా రాష్ట్రంలో ఏం జరిగినా అందుకు జగన్‌ని బాధ్యుడ్ని చేయడం మాత్రం భలే నేర్చుకున్నారు. ఆ మధ్య ఒక మంత్రి వారి పుత్రరత్నం ఒక మైనారిటీ టీచర్‌పై అఘాయిత్యం చేయాలని చూసిన సందర్భంలో కూడా ఆ ఘటన వెనకాల జగన్ ఉన్నాడని కామెడీ చేశారు టిడిపి జనాలు. ఇప్పుడు జనసేన వ్యవహారం కూడా అలానే ఉంది. టిడిపి, జనసేన, ఎల్లో మీడియా జనాలందరూ కూడా జగన్‌ని టార్గెట్ చేస్తూ జగనే తమని టార్గెట్ చేస్తున్నాడని పెడబొబ్బలు పెట్టడం మాత్రం మరీ విడ్డూరంగా ఉంది. అయినా ప్రజలను ఏ స్థాయిలోనైనా మాయ చేయగలమన్న నమ్మకం ఏ స్థాయిలో ఉంటే ఇలాంటి రాజకీయాలు చేస్తారో కదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -