Saturday, April 27, 2024
- Advertisement -

పాట.. పాట.. పాట.. ఎవరి నోట?

- Advertisement -

‘గానే గానే పే లిఖే హే గానే వాలోంకీ నామ్’ అనేవారు దివంగత గాయకులు పి.బి.శ్రీనివాస్. బియ్యం గింజ పైన తినేవారి పేరు రాస్తున్నట్టే ప్రతి పాట మీద పాడేవారి పేరు రాసుంటుందని ఆయన ఓ సందర్భంలో అన్నారు. పాటకు గాయకులు ప్రాణం పోస్తారు. ఆ పాట గాయకుణ్ని చిరకాలం గుర్తుండేలా చేస్తుంది. ఒకోసారి పాట ముందుగా ఎక్కడెక్కడో ప్రయాణించి చివరకు చేరాల్సిన గొంతును చేరుతుంది. ఆ పాట ముందుగా అందుకున్న వారు మిస్ చేసుకోగా, తర్వాత పాడిన వారు విశేషమైన పేరు తెచ్చుకున్నారు. అలా ఇతరులు మిస్ చేసుకున్న పాటలు పాడి హిట్‌ పాటను తమ ఖాతాలో వేసుకున్న ఐదుగురు గాయకులు ఇక్కడ..

ఎస్.జానకి(నీ లీల పాడెద దేవా)
1962లో తమిళంలో వచ్చిన ‘కొంజుం సలంగై’ అనే సినిమాలో సన్నాయితో పోటీ పడుతూ పాడే అద్భుతమైన పాట ఉంది. ఆ చిత్రాన్ని తెలుగులో ‘మురిపించే మువ్వలు’ అనే పేరుతో డబ్ చేశారు. అందులో ‘నీ లీల​ పాడెద దేవా’ అనే పాట తమిళంలో ముందుగా అనేక మంది గాయకుల వద్దకు వెళ్లింది. అయితే శ్రుతి ఎక్కువగా ఉన్న కారణంగా​ ఎవరూ పాడేందుకు ప్రయత్నం చేయలేదు. చివరకు గాయని పి.లీల ‘ఆ శ్రుతిలో పాడగలిగేది జానకి మాత్రమే’ అని చెప్పటంతో ఆ పాట ఎస్.జానకి పరమైంది. తెలుగు, తమిళం.. రెండు భాషల్లోనూ జానకే ఈ పాట పాడారు. ఆ తర్వాత ఆ పాట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు.

జేసుదాస్ (తెలవారదేమో స్వామి)
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రుతిలయలు’ సినిమాలోని ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది. ముందుగా ఈ పాటను ప్రముఖ శాస్త్రీయ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేత పాడిద్దామని అనుకున్నారు. సమయానికి ఆయన ఊళ్ళో లేకపోవడంతో అందుబాటులో ఉన్న జేసుదాస్ చేత పాడించారు. ఆయనకు ఈ పాట విశేషమైన పేరు తెచ్చిపెట్టింది.

సునీత (మాఘమాసం ఎప్పుడొస్తుందో)
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఎగిరే పావురమా’ సినిమాలోని ఈ పాట ఆ కాలం కన్నె పిల్లల గుండెల్లో పచ్చబొట్టులా నిలిచిపోయింది. గాయని సునీత పాడకముందు ఈ పాట ఇతర గాయనీమణుల వద్దకు వెళ్లింది. చివరకు అవకాశం సునీతను వరించి, ఆమెకు​ విపరీతమైన పాపులార్టీ సంపాదించి పెట్టింది.

ఆర్పీ పట్నాయక్ (చెప్పవే ప్రేమ)
2001లో విడుదలైన ‘మనసంతా నువ్వే’ చిత్రం ఆ కాలం యూత్‌ఫుల్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్. అందులో పాటలన్నీ సూపర్‌హిట్. ‘చెప్పవే ప్రేమ’ పాట కోసం సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ముందుగా గాయకుడు షాన్‌ని సంప్రదించారు. ముంబైలో రికార్డింగ్ కూడా జరిగింది. అయితే ఒక పదం సరిగ్గా పలికే విషయంలో​ షాన్‌కీ, ఆర్పీ పట్నాయక్‌కీ మధ్య విభేదాలు రావడంతో చివరకు ఆ పాట పట్నాయక్ పాడారు.

ప్రణవి (రబ్బరు గాజులు.. రబ్బరు గాజులు)
‘యమదొంగ’ సినిమాలో ‘రబ్బరు గాజులు’ పాట ఎంత ఫేమస్సో చెప్పనవసరం లేదు. సంగీత దర్శకుడు కీరవాణి ముందుగా ఈ పాటను​ గాయని విజయలక్ష్మి చేత పాడించారు. ఆ తర్వాత పాటలోని మేల్ వెర్షన్ దళేర్ మెహందీ పాడారు. ఇద్దరి గొంతుల మధ్య శ్రుతి తేడా రావడంతో చివరకు ఆ పాట గాయని ప్రణవి చేతికి దక్కి, ఆమె కెరీర్లో పాపులర్ సాంగ్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -