Friday, May 3, 2024
- Advertisement -

హిట్ మ్యాన్ షో అదుర్స్‌….ప్ర‌పంచ‌క‌ప్‌లో బోణీ కొట్టిన భార‌త్‌..

- Advertisement -

అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. శతకోటి భారతావని ఆశలను మోసుకుంటూ బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టిన టీమ్‌ఇండియా అంచనాలకు అనుగుణంగా విజృంభించింది. మెగాటోర్నీలో ఆలస్యంగా బరిలోకి దిగినా..అదిరిపోయే విజ‌యంతో బోణీ కొట్టంది. సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది.

బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తే..మణికట్టు మాయగాడు చాహల్ స్పిన్ తంత్రంతో నడ్డివిరిచాడు. ఫలితంగా స్వల్ప స్కోరుకే పరిమితమైన దక్షిణాఫ్రికా..పేలవ ఫీల్డింగ్‌తో లడ్డూ లాంటి అవకాశాలను జారవిడుచుకుంది. హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ అజేయ సెంచరీతో ఇన్నింగ్స్ ఆసాంతం తానై నడిపించిన వేళ సఫారీలు చేష్టలుడిగిపోయారు.

మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌ఫారీల‌కు బూమ్రా చుక్క‌లు చూపించాడు. యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీసుకుని సఫారీల వెన్ను విరిచాడు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలు రెండేసి వికెట్లతో ఆ తర్వాత పని కానిచ్చి సఫారీలను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో క్రిస్ మోరిస్ చేసిన 42 పరుగులే అత్యధికం. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

228 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 13 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (8) అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (18) నిరాశపరిచినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం క్రీజులో పాతుకుపోయి దక్షిణాఫ్రికా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు.అజేయంగా 122 పరుగులు చేసి ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున తొలి సెంచరీ సాధించాడు.

సఫారీ పేస్ ద్వయం రబాడ, మోరిస్ స్వింగ్‌తో భారత ఓపెనర్లు రోహిత్‌శర్మ(122 నాటౌట్), ధవన్ (8) చాలా ఇబ్బంది పడ్డారు. వ్యక్తిగత స్కోరు 1 వద్ద రబాడ బౌలింగ్‌లో రోహిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. రబాడ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ తొలి బంతికి ధవన్..డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లోకేశ్ రాహుల్ 26, ధోనీ 34 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 15 పరుగులు చేసి మ్యాచ్‌కు ఘనమైన ముగింపు ఇచ్చాడు. సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించిన రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -