Thursday, April 25, 2024
- Advertisement -

అంతా షాక్‌, కొట్టినంత పనిచేసిన కెప్టెన్‌!

- Advertisement -

బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్, మాజీ కెప్టెన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. మైదానంలో సహచర ఆటగాడిపై కోపంతో విరుచుకుపడ్డాడు. అతడిని కొట్టినంత పని చేశాడు. ఇతర ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో కాస్త కూల్‌ అయ్యాడు. కానీ అతడి చేతిలో తిట్లు తిన్న ప్లేయర్‌ మాత్రం భయంతో బిక్కచచ్చిపోయాడు. ‘బంగబంధు టి20 కప్‌’ సందర్భంగా సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఇందులో రహీమ్‌ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్‌ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది.

మ్యాచ్‌ జరుగుతుండగా బౌన్సర్‌ను ఆడే క్రమంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ అఫిఫ్‌ హొస్సేన్‌ కొట్టిన షాట్‌ అక్కడే గాల్లోకి లేచింది. కీపర్‌ రహీమ్, ఫైన్‌ లెగ్‌ ఫీల్డర్‌ నజుమ్‌ అహ్మద్‌ క్యాచ్‌ అందుకునే క్రమంలో ఢీకొట్టుకోబోయారు. కానీ రహీమ్‌ తడబడుతూనే క్యాచ్‌ పట్టేశాడు. క్యాచ్‌ పట్టిన వెంటనే సహచరుడు నజుమ్‌ను అదే చేత్తో కొట్టబోయాడు. రహీమ్‌ చర్యకు నజుమ్‌ ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. నిజానికి ఈ క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో ఉన్న నజుమ్‌ అందుకోవాలి. కానీ రహీమ్‌ ఎలాంటి సంజ్ఞ ఇవ్వకుండానే పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్‌ పట్టడం గమనార్హం. సీనియర్‌ ప్లేయర్‌ అయిన రహీమ్‌ ఓ జూనియర్‌ క్రికెటర్‌ పట్ల ఇలా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఢాకా జట్టు 9 పరుగుల తేడాతో గెలుపొందింది. ఒకవేళ ఈ క్యాచ్‌ మిస్‌ అయి ఉంటే కథ వేరేలా ఉండేది. అందుకే కెప్టెన్‌ అంతలా సీరియస్‌ అయ్యాడని ముష్పికర్‌ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఢాకా జట్టు నిర్ణీత ఓవర్లలో 150 పరుగులు చేసింది. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నవేళ ముష్పికర్‌ 43, యాసిర్‌ అలీ 54 పరుగులతో రాణించడంతో ఢాకా జట్టు మంచి స్కోరు నమోదు చేయగలిగింది. ఇక చివరికంటా పోరాడిన బరిషల్‌ జట్టు 141 పరుగులకే ఆలౌట్‌ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -