Friday, April 26, 2024
- Advertisement -

సిటీ బస్సులు ఎప్పుడు తిరుగుతాయంటే..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ బస్సు సేవలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కానీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలో మాత్రం సిటీ బస్సులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు ఓ శుభవార్త వినిపించాయి. ఈ నెలాఖరు నాటికి గ్రేటర్ పరిధిలో సిటీ బస్సుల సేవలు మొదలవుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో ఇప్పటికే మెట్రో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో, సిటీ బస్సులను కూడా నిబంధనల మేరకు నడిపించేందుకు ఏర్పాట్లు మొదలైపోయాయని తెలిపారు. ఈ విషయమై ఒకటి, రెండురోజుల్లోనే అధికారిక ప్రకటన విడుదల అవుతుందని తెలుస్తోంది.

ఈ మేరకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, ఇప్పటికే ప్రభుత్వానికి తన ప్రతిపాదనలు పంపింది. ముంబై, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయని, అవే నిబంధనలతో హైదరాబాద్ లోనూ బస్సులను తిప్పుతామని, భౌతిక దూరాన్ని పాటించేలా చూస్తామని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. గడచిన ఆరు నెలలుగా బస్సులు నడవని నేపథ్యంలో, భారీ నష్టంలో ఉన్నామని, ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు మొరపెట్టుకున్నారు.

కాగా, కరోనా, లాక్ డౌన్ కు ముందు టీఎస్ ఆర్టీసీ 1,400 రూట్లలో 3 వేలకు పైగా బస్సులతో 43 వేల ట్రిప్ లను నడుపుతూ, 30 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చేది. మార్చి 22 నుంచి సిటీ బస్సులు నిలిచిపోయాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ సిటీ బస్సులు రోడ్డెక్కలేదు. జిల్లాలకు వెళ్లే బస్సులు మాత్రం పరిమితంగా తిరుగుతున్నాయి. బస్సులు ఎక్కేందుకు ప్రజలు సైతం జంకుతున్నారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, పరిమితంగానైనా, హైదరాబాద్, సికింద్రాబాద్ సహా గ్రేటర్ పరిధిలో సిటీ బస్సులను తిప్పేందుకు తమకు అనుమతించాలని రెండు నెలల క్రితమే టీఎస్ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, కేసుల తీవ్రత దృష్య్యా, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఇక ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతూ ఉండటంతో, నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం నుంచి అతి త్వరలోనే అంగీకారం వస్తుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -