క్రిస్మస్ పండుగ‌కు ముందు అమెరిక‌న్ల‌కు షాక్‌..

395
Donald Trump : U.S. Government Shuts Down Over Border Wall Funding
Donald Trump : U.S. Government Shuts Down Over Border Wall Funding

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్, ఇతర కాంగ్రెస్ సభ్యుల మధ్య కొనసాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. మెక్సికో-అమెరికాల మధ్య గోడ నిర్మాణం విష‌యంలో విభేదాలు కొన‌సాగుతున్నాయి. దాని కార‌ణంగా ప్రభుత్వానికి మరోసారి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ట్రంప్ సర్కారు మరోసారి స్తంభించిపోయింది.

ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమెరికా మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు ఇచ్చే తీర్మానానికి అమెరికన్ కాంగ్రెస్ నో చెప్పింది. ఈ అంశంపై ట్రంప్, డెమోక్రాట్ల మధ్య రాజీ కుదరలేదు. దీంతో మరోసారి అమెరికా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.

మెక్సికో-అమెరికాల మధ్య గోడ నిర్మాణం కోసం తక్షణం రూ.35,070 కోట్లు(5 బిలియన్ డాలర్లు) విడుదల చేయాలన్న ఆయన డిమాండ్ కు కాంగ్రెస్ లోని విపక్ష డెమొక్రాట్లతో పాటు సొంత రిపబ్లికన్ పార్టీ నేతలే అంగీకరించలేదు. ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు అవసరమైన ఫెడరల్ వ్యయ బిల్లుకు ఆమోదం తెలపకుండానే కాంగ్రెస్ వాయిదా పడింది. దీంతో అమెరికా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు పాక్షింగా స్తంభించిపోయాయి.

ఈ కారణంగా కేబినెట్‌ స్థాయిలోని 15 విభాగాల్లో తొమ్మిదింటికి ఖజానా నుంచి ఎలాంటి నగదు అందని పరిస్థితి ఏర్పడింది. నిధుల కొరత వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడనుంది. మరోవైపు క్రిస్మస్‌ సీజన్‌లో దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు జీతం లేకుండా ఇళ్లకే పరిమితం కానున్నారు. నాసా ఉద్యోగులకు కూడా జీతాలు అందలేదు.

క్రైస్తవులకు పవిత్రమైన క్రిస్మస్ పర్వదినానికి ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో చాలామంది అమెరికన్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోనున్నారు. అమెరికాకు మెక్సికో నుంచి వలసలను నివారించేందుకు గోడ నిర్మించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా షట్ డౌన్ కు డెమొక్రాట్లే కారణమని ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో ఈ ఏడాదిలో మూడుసార్లు షట్ డౌన్ సంభవించింది.

Loading...