ఏపీలో అలజడి.. తెలంగాణలో ఆనందమా?

2285
KTR Comments on AP 3 Capitals issue
KTR Comments on AP 3 Capitals issue

ఏపీలో అలజడి రేగుతోంది. అమరావతి రాజధాని మార్పుపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. విశాఖకు రాజధాని మార్పు తర్వాత మరింత గందరగోళం నెలకొనడం ఖాయం. ఈ నేపథ్యంలోనే ఏపీలోని పరిస్థితులపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల్లోనూ ఒక రకమైన ఆనందం వ్యక్తమవుతోందా అంటే ఔననే సమాధానం వస్తోంది.

ఇటీవలే రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ ‘ఏపీలో అమరావతి మార్పు వ్యక్తిగతంగా తెలంగాణ వాసిగా నాకు ఆనందమేనని.. అక్కడి పెట్టుబడులు హైదరాబాద్ కు వచ్చి మా రాష్ట్రం బాగుపడుతుందని.. భారతీయుడిగా మాత్రం బాధపడుతున్నానని అన్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్ సైతం ఇదే వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక విలేకరుల సమావేశంలోనూ ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై ఆనందంతో కూడిన ఎద్దేవా చేసేలా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో రాజధాని మార్పుపై జరుగుతున్న ఆందోళనలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఎం కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా మారిస్తే ప్రజా వ్యతిరేకత రాలేదని.. ఇదే క్రమంలో ఏపీలో రాజధాని మార్పు కోసం ఆందోళనలు జరుగుతున్నాయని.. తెలంగాణలో ఆందోళనలు జరిగాయా అని ఏపీ పరిస్థితిపై కేటీఆర్ సెటైర్లు వేశారు.

ఇక పవన్ కళ్యాణ్-బీజేపీ పొత్తుపైన కూడా కేటీఆర్ కౌంటర్లు వేశారు. తెలంగాణలోనూ బీజేపీతో పవన్ ముందుకెళ్తారట అని విలేకరులు ప్రశ్నించగా.. ‘తెలంగాణలోనే కాదు.. కశ్మీర్ లో కూడా పవన్ పార్టీ పొత్తులు పెట్టుకోవచ్చు. ఈ క్రమంలోనే జనసేన అంతర్జాతీయ పార్టీ కూడా కావచ్చేమో’ అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో లొల్లి మాకు అవసరం లేదని.. అక్కడి ప్రజలు చూసుకుంటారని సమస్యను దాటవేశారు.

దీన్ని బట్టి ఏపీలో ఆందోళనకర పరిస్థితులపై తెలంగాణ రాజకీయ నేతల్లో ఒకరకమైన ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పవచ్చు. అక్కడి పరిణామాలను క్యాష్ చేసుకునేలా తెలంగాణ రాజకీయం నడుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Loading...