Friday, April 26, 2024
- Advertisement -

మన మెతుకు బతుకు పోల’వరం’

- Advertisement -

పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. ఏపీ మనుగడకు కల్పవృక్షం. లక్షల ఎకరాలకు కామధేనువు. ఏపీ విభజనతో హైదరాబాద్ తెలంగాణకు దక్కింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే ఆ లోటు ఆంధ్రాకు తీరుతుందని అనేకమంది ఆర్ధిక, వ్యవసాయ, రాజకీయ రంగ నిపుణులు, రైతు సంఘాలు, మేథావులు అభిప్రాయపడ్డారు. ప్రతిష్ఠాత్మకమైన ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు 4 లక్షల ఎకరాలకు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అంచనా. విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు పట్టణానికి తాగు నీటిని అందించవచ్చు. గుంటూరు జిల్లా, కృష్ణా బేసిన్ కూ అవసరాల మేరకు జలాలు తరలించవచ్చు. మరోవైపు వందల కిలోమీటర్లు ఏర్పాటు చేసే కాలువల ద్వారా జలరవాణాకు ప్రణాళికలున్నాయి. 960 మెగావాట్ల భారీ విద్యుత్ ప్రాజెక్టులనూ చేపట్టడంతో ఆర్ధికంగా ఎంతో లాభసాటి.

అయితే గోదావరిలో ఆటుపోట్లు మాదిరిగానే పోలవరం ప్రాజెక్టులోనూ ఎన్నో ఒడిదుడుకులు. వాస్తవానికి ఈ బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ, తొలి ఆలోచన కలిగింది 1941లోనే. ఆనాటి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎల్.వెంకటకృష్ణ అయ్యర్, పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మించాలని మొదటిసారిగా ప్రతిపాదనలు తెచ్చారు. అప్పుడు దీనికి పెట్టిన పేరు రామపాదసాగర్. అప్పటి అంచనా వ్యయం 129 కోట్ల రూపాయలు. కానీ ఆనాటికి అదే పెద్ద బడ్టెట్ కావడంతో ప్రతిపాదనలు వాస్తవరూపం దాల్చలేదు. కాలక్రమంలో ఖర్చులు అంచనాలు పెరుగుతూ వచ్చాయి. గోదారి మలుపులు తిరిగినట్టే ప్రాజెక్ట్ కూడా లెక్కలేనన్ని మలుపులు తిరిగింది. చివరికి జాతీయ హోదా సాధించుకుంది. కానీ పాలకుల చిత్తశుద్ధే కరువైంది.

సంవత్సరం అంచనా వ్యయం
1941-42 రూ 129 కోట్లు
1985-86 రూ 2,665 కోట్లు
2005-06 రూ 10,151 కోట్లు
2010-11 రూ 16,010 కోట్లు
2013-14 రూ 58,319 కోట్లు

2013-14 ధరల ప్రకారం ప్రాజెక్ట్ బడ్జెట్‌ రూ.58,319 కోట్లకు చేరినట్లు 2017లో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక పంపింది. జాతీయ ప్రాజెక్ట్ కనుక మీరు పూర్తి చేస్తారా ? నిధులిచ్చి మమ్మల్ని పూర్తి చేయమంటారా ? అని అడిగింది. 2014 మార్చి నుంచి 2017 నాటికి కేంద్రం ఇచ్చింది రూ.2,916.54 కోట్లు. 2017 జనవరి నాటికి ఈ ప్రోజక్ట్ కోసం మొత్తం ఖర్చు చేసింది రూ.8,898 కోట్లు. కానీ ఇంకా ఖర్చు చేయాల్సింది దాదాపు 50వేల కోట్ల పైనే. అంత నిధులు ఇప్పట్లో కేంద్రం ఇచ్చే పరిస్థితి కానరావట్లేదు. గత బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించినప్పుడే మోడీ, బీజేపీ చిత్తశుద్ధి, ఏపీపై ప్రేమ బయటపడిపోయాయి.

కానీ ఇప్పటికే చాలా ఇచ్చాం. వాటికి లెక్కలు చెప్పండి ముందు అని బీజేపీ డ్రామాలాడుతోంది. మీరు ఇచ్చింది గోరంత ఇవ్వాల్సింది కొండంత అని టీడీపీ ఆ డ్రామాను మరింత రక్తి కట్టిస్తోంది. పోలవరం డ్రామాలో బీజేపీ, టీడీపీ కేవలం పాత్రధారులే. అసలు సూత్రధారి వైఎస్ఆర్. ఆయనే ఆ ప్రాజెక్టును ప్రతిపాదించారని చెప్పుకుంటోంది వైఎస్ఆర్ సీపీ. మొత్తానికి మూడు పార్టీలు కలిపి ఆ ప్రాజెక్టు నిధులు, వాటిలో మిగులు, వచ్చే ఓట్లు గురించే ఆలోచిస్తున్నారు తప్ప. ఏ ఒక్క పార్టీ కూడా నిజంగా చిత్తశుద్ధితో నిర్మాణం పూర్తిచేయడానికి కృషి చేయడం లేదు. అందుకే కామధేనువు లాంటి పోలవరం ఈ స్వార్ధ రాజకీయాలతో శాపంగా మారుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -