Saturday, April 27, 2024
- Advertisement -

ఛీ… ఛీ…. ఎల్లో మీడియా రాతలు…… ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణా సమాజం…. సెటైర్స్ వేస్తున్న సీమాంధ్రులు

- Advertisement -

తెలుగు ప్రజలను ఉద్ధరించడం కోసం మాత్రమే మా జర్నలిజం అని అస్తమానూ నీతులు చెప్పే ఎల్లో మీడియా సంస్థల అసలు నైజం రోజు రోజుకూ జనాలకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత నుంచీ ఇంకా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా సూపర్ పాపులర్ అవుతున్నకొద్దీ బాబుగారి భజన మీడియా అసలు రంగులు జనాలకు స్పష్టంగా తెలిసి వస్తున్నాయి. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా సోషల్ మీడియా ఇదే స్థాయిలో ఉండి ఉంటే చరిత్రలో ఇంకోలా ఉండేదని సీనియర్ జర్నలిస్టులు కూడా విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియా సూపర్ యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు సమయంలో చేసిన కుట్రలనే మరోసారి చేస్తామంటే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా జనాలు ఎల్లో మీడియాను ఉతికి ఆరేస్తున్నారు. ఎల్లో మీడియా నైజం ఎలా ఉంటుందో ఇవాంక హైదరాబాద్ పర్యటన సందర్భంగా, జిఈఎస్ మీట్ సందర్భంగా మరోసారి తెలుగు ప్రజలకు స్పష్టంగా తెలిసొచ్చింది.

హైదరాబాద్‌ని తానే కనిపెట్టానన్నట్టుగా చెప్పుకునే చంద్రబాబు పాత్ర మెట్రో నిర్మాణంలో ఇసుమంత కూడా లేదన్నది వాస్తవం. చంద్రబాబు కనీసం మెట్రో కోసం కేంద్రానికి ఒక అర్జీ పెట్టి ఉన్నా కూడా ఈ పాటికి ఆయన భజన మీడియా సంస్థలు…. చంద్రబాబు దార్శనికుడు, అంతా కూడా అర్జీని ఆయన స్వ హస్తాలతో ఫిలప్ చేసిన మహిమ….. అప్పట్లో రాసేవాళ్ళు ఎవరూ లేకపోయినా, ఆహారం కూడా తీసుకోకుండా చంద్రబాబు ఎంత కష్టపడి ఆ అర్జీని రాశాడు అనే విషయాన్ని ఓ స్థాయిలో జనాలకు వివరించేవి. చదివిన వాళ్ళందరూ కూడా అరే అర్జీ రాయడం ఇంత కష్టమా అనేలా ఫీలయ్యేలా రాసేవాళ్ళు. కావాలంటే ఐదున్నర కోట్ల రూపాయల ఫైవ్ స్టార్ హోటల్ లాంటి బస్సులో చంద్రబాబు నిద్ర గురించి ఎలా రాశారో ఒకసారి గుర్తుచేసుకోండి. మెట్రో నిర్మాణంలో చంద్రబాబు పాత్ర లేదు కాబట్టి ఆ మెట్రో స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయడానికి ఎల్లో మీడియా చేయని ప్రయత్నాలు లేవు.

ఒకవైపు మెట్రో గురించి గొప్పగా రాస్తూనే ఈ మెట్రో వళ్ళ సామాన్యులకు ఏమీ ఉపయోగం ఉండదు, ఛార్జీలు చాలా ఎక్కువ అంటూ ఎన్ని రకాలు రాశారో చెప్పనక్కర్లేదు. ఇక మేయర్ బొంతు రామ్మోహన్‌రావు రాజీనామా అంటూ చేసిన హంగామా కూడా అంతా ఇంతా కాదు. ఆ రాతలకు చిరాకొచ్చి ఆయన ఏకంగా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం గమనార్హం. మెట్రో ప్రారంభోత్సవాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేసింది ఎల్లో మీడియా. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణా వాసులు ఎల్లో మీడియాపై ఓ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సీమాంధ్ర నుంచి వచ్చిన నాయకుడైన వైఎస్సార్ హయాంలో మెట్రా నిర్మాణం ప్రారంభం అయిన విషయాన్ని కూడా ఎల్లో మీడియా ప్రస్తావిస్తే ఒట్టు. మెట్రో ఒక్కటే కాదు అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు కూడా వైఎస్ హయాంలోనే ప్రారంభమయ్యాయన్నది నిజం. కానీ చంద్రబాబులా వైఎస్‌కి ప్రచార యావ లేదు. అలాగే ఇప్పుడు కెసీఆర్ కూడా మెట్రో నిర్మాణం క్రెడిట్‌ని పూర్తిగా తన ఖాతాలో వేసుకోవాలని అనుకోలేదు. అలాంటి తెలివితేటలన్నీ సామర్థ్యం తక్కువ, ప్రచార యావ ఎక్కువ ఉన్నవాళ్ళకే ఉంటాయి.

మెట్రో విషయం పక్కన పెడితే జీఈఎస్ సమ్మిట్ నిర్వహించే గొప్ప అవకాశం హైదరాబాద్‌కి రావడాన్ని కూడా సహించలేకపోయింది ఎల్లో మీడియా. బాబుగోరు ఇచ్చిన ప్రజెంటేషన్‌కి ట్రంప్ బృందానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందని, బాబుగోరి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సమ్మిట్ నిర్వహించడానికి అమెరికా అధ్యక్షుడు ఆనందోత్సాహాల మధ్య ఒకె అన్నాడని…. అయితే కేవలం ఫైవ్ స్టార్, త్రీ స్టార్ స్థాయి హోటల్స్ లేకపోబట్టే వైజాగ్‌కి సమ్మిట్ రాలేదని…….. నంబర్ ఒన్ పత్రిక….. భజనలో కూడా నంబర్ ఒన్నేలే…… లో వచ్చిన వార్త అయితే సోషల్ మీడియాలో నవ్వులు పూయించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు పోటీపడితే సమ్మిట్ నిర్వహించే అవకాశాన్ని తెలంగాణా రాష్ట్రం సొంతం చేసుకుంది అన్నది నిజం. కాకపోతే ఫైవ్ స్టార్, త్రీ స్టార్ హోటల్స్ లేకే చంద్రబాబు ఫెయిలయ్యాడని చెప్పడం భజన మీడియాకే చెల్లింది. ఇక చంద్రబాబును కాదన్నందుకు జీఈఎస్ సమ్మిట్ స్థాయిని తగ్గించే ప్రయత్నం కూడా గట్టిగానే చేసింది ఎల్లో మీడియా. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడానికి ఒప్పుకోని ఇవాంకను కూడా తక్కువ చేశారు. ఆల్రెడీ బూతు ఛానల్, బూతు పత్రికగా పేరు పడ్డ ఒక మీడియా సంస్థ అయితే మోడలింగ్ నాటి ఇవాంక వీడియోలు, ఫొటోలను చూపించి తన స్థాయి ఏంటో మరోసారి నిరూపించుకుంది. అయినా ఈ బూతు పత్రిక నైజం ఎప్పుడూ ఇంతే. రోజా టిడిపిలో ఉన్నంత కాలం ప్రజానాయకురాలు, గొప్ప మహిళా నాయకురాలు అని చెప్పారు. జగన్ పార్టీలో చేరిన వెంటనే రోజాని ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్ స్థాయికి దిగజార్చడానికి శాయశక్తులా కృషిచేశారు. ఇప్పుడు చంద్రబాబు అభ్యర్థనను కాదన్నందుకు ఇవాంక స్థాయిని కూడా తగ్గించే ప్రయత్నం చేశారు. ట్రంప్ సారథ్యంలో ఉన్న అమెరికా ప్రభుత్వానికి ఇప్పుడు ఇవాంక ప్రధాన సలహాదారు.

తండ్రిని గెలిపించడంలో ఇవాంక ట్రంప్ సామర్థ్యం గురించి కూడా ఆంగ్ల మీడియా ఎన్నో కథనాలు ప్రచురించింది. అలాగే తన ప్రసంగాల్లోనూ, వస్త్రధారణలోనూ హుందాతనం, ప్రతిభను ఆవిష్కరించింది ఇవాంకా. అలాగే భారతీయుల గురించి ఇవాంక మాట్లాడిన మాటలు కూడా చాలా గొప్పగా సాగాయి. అయినప్పటికీ ఎల్లో మీడియాకు మాత్రం ఆమె మోడలింగ్ నాటి వీడియాలే దొరికాయి. ఇక ఈ సమ్మిట్‌కి వచ్చిన ఒక వ్యక్తిని మాత్రం ఎల్లో మీడియా బాగా హైలైట్ చేసి చూపించింది. ఆమే చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మిణి. అయితే బ్రాహ్మిణి మాత్రం ఎల్లో మీడియాలగా ఛీప్‌గా బిహేవ్ చెయ్యలేదు. చాలా హుందాగా మాట్లాడింది. ఆంద్రాకు రాకపోయినా…..తెలంగాణాలో జరుగుతున్నప్పటికీ గొప్పగా నిర్వహించారని చెప్పుకొచ్చింది.

చివరగా కెసీఆర్ గురించి మాత్రం చాలా చెప్పుకోవాలి. ఇక్కడ కూడా ఎల్లో మీడియా జనాలు కెసీఆర్‌ని తగ్గించే ప్రయత్నం చేశారు. నరేంద్రమోడీ ఎడమ చేత్తో కేసీఆర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చాడని కోడి గుడ్డు మీద ఈకలు పీకుతూ వాళ్ళకు నచ్చిన వార్తలు ఏదో రాశారు. కానీ కెసీఆర్ పాలనా సామర్థ్యం మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంది. ఏర్పాట్లలోనూ, ఈవెంట్ సందర్భంగా కెసీఆర్ చాలా తక్కువ కనిపించారు. అలాగే తన ప్రతిభ గురించి తానే డప్పు కొట్టుకోకుండా క్లుప్తంగా మూడు నిమిషాల్లో తన ప్రసంగాన్ని అద్భుతంగా వినిపించి ఆహూతులను ఆకట్టుకున్నారు. అన్నింటికీ మించి కోట్లాది రూపాయల పెట్టుబడులను తీసుకురావడంలో, సమ్మిట్ నిర్వహించడంలో అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. తన గురించి కాకుండా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ గురించి మాట్లాడుకునేలా చేశాడు.

మరి ఇదే సదస్సును చంద్రబాబు నిర్వహించి ఉంటే ఎలా ఉండేది? ప్రతి క్షణం చంద్రబాబే కనిపించి ఉండేవాడు. ఇక వైజాగ్ సదస్సులో చేసినట్టుగా వందల, వేల కోట్ల దొంగ పెట్టుబడిదారులతో ఫొటోలు దిగడాలు, గంటలు గంటలు తన గురించి తానే డప్పుకొట్టుకుని విసుగెత్తించడాలు ……..ఎన్ని జరిగి ఉండేవో. ఇక బాబు భజన మీడియా కూడా ఓ స్థాయిలో చిడతలు వాయించి ఉండేది. ఇప్పుడు వాస్తవాలు గ్రహిస్తున్న సీమాంధ్రులు కూడా ఎల్లో మీడియా రాతలపై సెటైర్స్ వేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో తెలంగాణా జనాలు అయితే ఎల్లో మీడియాను ఉతికి ఆరేస్తుండడం గమనార్హం. ఏది ఏమైనా కెసీఆర్ మాత్రం పనిమంతుడికి, మాటకారికి ఉన్న తేడాను స్పష్టంగా చూపించాడు అని సీమాంధ్రులు చెప్పుకుంటూ ఉండడం గమనార్హం. చంద్రబాబు కూడా తన డప్పు తాను కొట్టుకోవడం కాస్త తగ్గించి………మూడున్నరేళ్ళ తర్వాత అయినా మాటలు, గ్రాఫిక్స్ బొమ్మల వ్యవహారం పక్కనపెట్టి చేతల్లో ఏమైనా చూపిస్తే బెటర్ ఏమో…….ఏమంటారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -