జయలలిత గురించీ ఆమె రాజకీయ ప్రస్థానం గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా అతిపెద్ద చర్చ జరుగుతోంది. పురుచ్చి తలైవి గా తమిళనాట అందరితో జేజేలు అందుకున్న ఆమెకి కూడా తీరని కోరికలు ఉన్నాయి అంటే నమ్మ గలరా ? ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఆమెకి మిగిలిపోయి ఉన్న అతిపెద్ద కోరిక ఆమె ప్రధానమంత్రి అవ్వడమే. రాజకీయాలలో విపరీతమైన ఆటుపోట్లని ఎదురుకొన్న తరవాత ముఖ్యమంత్రి పీఠాన్ని ఒకటి కాదు రెండు కాదు ఆరు సార్లు ఎక్కిన అమ్మకి మెయిన్ టార్గెట్ ప్రధాని పీఠం అని చెబుతారు.
సౌత్ లో తనకంటే ఎక్కువగా ప్రధాని అయ్యే అర్హత ఎవ్వరికీ లేదు అని ఆమె ఫీల్ అయ్యేవారట. 2019ఎన్నికలపై ఆమె దృష్టిపెట్టారు. ప్రధాని కాకముందు మోడితో ఆమెకు మంచి సంబంధాలుండేవి. గుజరాత్ – తమిళనాడు ముఖ్య మంత్రులుగా పలు సందర్భాల్లో వారిద్దరూ చర్చలు జరిపారు. మోడీ ప్రధాని అయ్యాక ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి హీనంగా మారడంతో ఉత్తరాదిన కాంగ్రెస్ అవసరం తనకుంటుందని జయలలిత అంచనాలేశారు. ఆ పార్టీ నేతల్తో సమయస్ఫూర్తిగా వ్యవహరించడం మొదలెట్టారు.
మరోవైపు బిజెపి – కాంగ్రెస్సేతర పార్టీల్తో మూడోకూటమి కట్టే అవకాశాలు తనకు మాత్రమే ఉన్నాయని ఆమె భావించేవారు. వామపక్షాల్తో పాటు యునైటెడ్ జనతాదళ్ – సెక్యులర్ జనతాదళ్ – సమాజ్ వాది పార్టీ – బిఎస్ పి – తృణమూల్ తదితర పార్టీల్తో కూటమి కడితే కనీసం 150నుంచి 170సీట్లు వచ్చే ఎన్నికల్లో సాధించే అవకాశాలుంటాయని ఆమె భావించేవారు. అప్పటికి మోడి ప్రాభవం తగ్గుతుంది.అలాగని కాంగ్రెస్ కు పెద్దగా ఎదుగుదలుండదు. దీంతో తృతియ కూటమే ప్రత్యామ్నాయంగా మారుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు బిజెపిని స్వయంగా నిలువరించే శక్తిలేక మూటోకూటమికి మద్దతిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేసేవారని చెబుతుంటారు. అయితే.. మృత్యువు ఆమె కలలను ఛిద్రం చేసింది.
