తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీతో పాటు చుట్టుపక్కల ఉన్న అమీన్ పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీ.కె. తండా గ్రామ పంచాయితీలను కలిపి ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, హైకోర్టు ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందే నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలలో స్పష్టంగా పేర్కొంది. ఈ ఆదేశంతో నెక్కొండ ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల సంఖ్య పెరగనుంది.
