- Advertisement -

సోషల్ మీడియా..ఆర్మీకి కొత్త నిబంధనలు!

- Advertisement -

భారత సైన్యం తన సిబ్బందికి సంబంధించిన సోషల్ మీడియా విధానంలో కీలక మార్పులు చేసింది. కఠినమైన నిబంధనలతో కూడిన కొన్ని షరతులపై ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ (మునుపటి ట్విట్టర్), ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ అనుమతులు పూర్తిగా భద్రతా పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్నట్లు సైన్యం స్పష్టం చేసింది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (DGMI) ద్వారా ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌ను ‘చూడటం, పర్యవేక్షించడం’ వంటి పరిమిత ప్రయోజనాల కోసమే ఉపయోగించవచ్చు. పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం లేదా మెసేజులు పంపడం పూర్తిగా నిషేధం.

రక్షణ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం, సైనికులు ఇన్‌స్టాగ్రామ్‌లో తమ అభిప్రాయాలు వ్యక్తపరచడం లేదా ఏ రూపంలోనైనా యాక్టివ్‌గా పాల్గొనడం అనుమతించబడదు. ఇదే తరహాలో యూట్యూబ్, ఎక్స్, కోరా వంటి వేదికలపై కూడా కేవలం సమాచారాన్ని పొందడం, అవగాహన పెంచుకోవడం మాత్రమే అనుమతించారు.

స్కైప్, టెలిగ్రామ్, వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్‌లను మాత్రం సాధారణమైన, గోప్యత లేని సమాచారాన్ని మాత్రమే తెలిసిన వ్యక్తులతో మార్పిడి చేసుకునేందుకు అనుమతి ఉంది. రిసీవర్‌ను సరిగా గుర్తించే బాధ్యత పూర్తిగా వినియోగదారిదే అని సైన్యం స్పష్టం చేసింది. లింక్డ్‌ఇన్‌ను ఉద్యోగ సమాచారం లేదా రిజ్యూమ్‌ల కోసం మాత్రమే ఉపయోగించాలి.

అలాగే, క్రాక్ చేసిన సాఫ్ట్‌వేర్ వెబ్‌సైట్లు, పైరేటెడ్ మూవీస్, టోరెంట్లు, VPNలు, వెబ్ ప్రాక్సీలు, చాట్ రూమ్స్ వంటి వాటిని ఉపయోగించవద్దని సైన్యం హెచ్చరించింది. క్లౌడ్ డేటా స్టోరేజ్‌ను కూడా అత్యంత జాగ్రత్తగా వాడాలని సూచించింది. 2020 జూలైలో భద్రతా కారణాలతో భారత సైన్యం తన సిబ్బందికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలతో పాటు 89 యాప్‌లను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో చైనా సంబంధిత యాప్‌లు కూడా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -