విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఊహించని రీతిలో రసాభాసగా మారింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సమక్షంలోనే తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు బాహాబాహీకి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. సమావేశం ప్రారంభంలోనే తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ నేత రావి సౌజన్య రామ్ తాళ్లూరి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో సొంత పార్టీ నేతలు సౌజన్యపై డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆరోపణలు చేయడం కాదు, బయటకు వచ్చి స్పష్టంగా మాట్లాడాలని సౌజన్య ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఈ గొడవను కవర్ చేస్తున్న బిగ్ టీవీ కెమెరామెన్‌పై కొందరు జనసేన నేతలు దాడికి దిగారు. కెమెరాను లాక్కుని, కెమెరామెన్‌ను దుర్భాషలాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. మీడియా ప్రతినిధులపై దాడి చేయడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని పలువురు విమర్శించారు.
ఈ ఘటనపై స్పందించిన జనసేన నేత ఉదయ భాను వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జనసేన నేతలతో బిగ్ టీవీ కెమెరామెన్‌కు క్షమాపణలు చెప్పించడంతో ఉద్రిక్తత కొంత మేరకు తగ్గింది. అయితే ఈ ఘటన జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయనే సంకేతాలను ఇస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
