గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత్ అంతర్జాతీయ దౌత్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. కర్తవ్య పథ్ (మునుపటి రాజ్‌పథ్)పై జరిగే పరేడ్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యే ప్రపంచ నేతలు, భారత్–ఇతర దేశాల మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు సూచికగా మారారు. 2015 నుంచి ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన అగ్రనేతలు ఈ వేడుకలకు హాజరయ్యారు. కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్ల మధ్య కూడా భారత్ తన గ్లోబల్ భాగస్వామ్యాలను ప్రతిబింబించింది.
ఈసారి రిపబ్లిక్ డేకి అతిథిగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కలిసి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇది యూరోపియన్ యూనియన్ నుంచి తొలి సంయుక్త హాజరుగా నిలవనుంది.అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా 2015లో గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది కీలక ఘట్టంగా నిలిచింది.2016లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్వా హోలాండ్ ముఖ్య అతిథిగా వచ్చారు. రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం వంటి కీలక రక్షణ ఒప్పందాలకు ఇది మైలురాయిగా నిలిచింది.2017లో అబూదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరై, గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాల బలాన్ని చాటారు.
2018లో తొలిసారిగా 10 ఆసియాన్ దేశాల నేతలు కలసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘లుక్ ఈస్ట్’ నుంచి ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి ఇది ప్రతీకగా నిలిచింది.
2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, 2020లో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇది గ్లోబల్ సౌత్, బ్రిక్స్ దేశాలతో భారత్ సంబంధాలను బలపరిచింది.కోవిడ్ పరిమితుల కారణంగా 2021, 2022 సంవత్సరాల్లో ఎవరూ ముఖ్య అతిథులుగా హాజరుకాలేదు.
2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాహ్ ఎల్-సిసీ ముఖ్య అతిథిగా హాజరై, ఆఫ్రికా దేశాలతో భారత్ సంబంధాలకు కొత్త ఊపునిచ్చారు.2024లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా వచ్చారు.2025లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
