తెలుగు చిత్రపరిశ్రమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ టాలీవుడ్ నుంచి ఊహించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని నటి ఐశ్వర్య రాజేష్ భావోద్వేగంగా తెలిపారు. గతేడాది తెలుగులో ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ విజయంతో టాలీవుడ్‌లో తన కెరీర్ కొత్త దిశ తీసుకుంటుందని ఆమె ఆశించారు.
అయితే, ఆ అంచనాలు నెరవేరలేదని ఐశ్వర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ అయిన తర్వాత పెద్ద దర్శకులు, స్టార్ హీరోల సినిమాల నుంచి ఆఫర్లు వస్తాయని అనుకున్నాను. కానీ, అలాంటి అవకాశాలు రాకపోవడం నన్ను చాలా బాధించింది. అది మానసికంగా నిరాశకు గురి చేసింది అని ఆమె నిజాయితీగా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం యువ నటుడు తిరువీర్‌తో కలిసి ఓ కొత్త సినిమాలో నటించే అవకాశం తనకు లభించిందని, ఈ ప్రాజెక్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నానని ఐశ్వర్య తెలిపారు. కొందరు తెలుగు దర్శకులకు తన నటనా ప్రతిభపై సందేహాలు ఉండి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, తాను నటిస్తున్న ‘ఒరు సుకుమారి’ చిత్రం తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమా విడుదలైన తర్వాత తనపై ఉన్న అనుమానాలకు చెక్ పడుతుందని, ఇకపై బలమైన కథలు, అర్థవంతమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని ఐశ్వర్య రాజేష్ స్పష్టం చేశారు.
