భూ భారతి స్కాంపై వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ స్కాం వెనుక ఎవరున్నారు? దీని వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాల్లో భూ భారతి స్కాం వెలుగులోకి వచ్చినప్పటికీ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడించలేదని ఆయన ఆరోపించారు.
“మూడు జిల్లాల్లోనే ఇంత పెద్ద స్కాం బయటపడితే, రాష్ట్రవ్యాప్తంగా ఎంత జరిగిందో ఊహించాలి. దీని వెనుక ఉన్నవారిని బయటపెట్టాలి” అని హరీష్ రావు అన్నారు. 35 మండలాల్లో ఈ స్కాం జరిగినట్టు సమాచారం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి సిట్ విచారణ చేపట్టకపోవడంపై ఆయన ప్రశ్నించారు. “బీఆర్ఎస్ నాయకులపై అయితే సిట్లు, కమిషన్లు, సీఐడీ విచారణలు వేస్తున్నారు. కానీ ఇక్కడ 35 మండలాల్లో అక్రమాలు జరిగితే ఎందుకు మౌనం?” అని నిలదీశారు.
భూ భారతి పోర్టల్‌లోని ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్‌కు ఎలా లభించింది? ఆ కోడ్ అతని చేతికి ఎలా చేరింది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నాయకులు, కొంతమంది అధికారులు ప్రమేయం ఉన్నారని, అందుకే విచారణ జరగడం లేదని ఆరోపించారు.
నిషేధిత భూముల పేరిట కూడా భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. నిషేధిత భూముల జాబితా కోటి ఎకరాలను దాటిందని, ఆ జాబితాను పూర్తిగా ఆన్లైన్లో పెట్టాలని కోరారు. “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలువైన భూములను నిషేధిత జాబితాలో చేర్చి, వసూళ్లు పూర్తయ్యాక వాటిని తొలగిస్తున్నారు” అని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత జాబితాలో చేర్చారు? ఎన్ని తొలగించారు? అన్న వివరాలతో వైట్ పేపర్ విడుదల చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు.
