హైదరాబాద్‌లోని హయాత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భర్త తన భార్యను సుత్తితో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ సమస్యలపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన భర్త, ఇంట్లో ఉన్న సుత్తితో భార్య తలపై బలంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె కుప్పకూలిపోయింది.
అయితే తనపై అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు మరో నాటకం ఆడినట్టు పోలీసులు తెలిపారు. భార్య తలపై పెయింట్ డబ్బా పడిపోయిందని చెప్పుతూ ఆమెను చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సమాచారం.
ఇక ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన వారి కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.
ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీయడంతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
