హైదరాబాద్ నగరంలో మరోసారి గ్యాంగ్ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జరిగిన దాడి ఘటన స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. పాతబస్తీ సంతోష్ నగర్ పరిధిలోని జవహర్ కాలనీలో బాసిత్ అనే యువకుడిపై మాయా గ్యాంగ్ సభ్యులు దారుణంగా దాడి చేసిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం బయటకు రావడంతో ఘటన తీవ్రత వెలుగులోకి వచ్చింది.
సోహైల్, సౌద్ అనే మాయా గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు బాసిత్‌పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. వ్యక్తిగత వైరం లేదా ఇతర కారణాలతో ఈ దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనతో జవహర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రి వేళల్లో బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
దాడికి గల అసలు కారణాలు ఏంటన్నదానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్యాంగ్ కార్యకలాపాలపై కట్టడి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
