సిద్ధిపేట జిల్లాలో వ్యాపారవేత్తను హతమార్చారు కానిస్టేబుల్ దంపతులు. ఆన్లైన్ బెట్టింగుల వల్ల చేసిన అప్పులు తీర్చేందుకే హత్య చేసినట్లు గుర్తించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్నారు చిన్నకోడూరుకు చెందిన గౌటి ప్రవీణ్ అనే కానిస్టేబుల్.
గత రెండేళ్లుగా భార్య రజితతో కలిసి బెట్టింగులకు పాల్పడుతూ రూ. 60 లక్షలు నష్టపోయి ఎలాగైనా అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నారు దంపతులు. సిద్ధిపేట పట్టణానికి చెందిన బెల్దె విశ్వనాధం(57) అనే వ్యాపారవేత్త వద్ద స్థలం తాకట్టు పెట్టి బెట్టింగ్ కోసం రూ.12 లక్షలు అప్పు తెచ్చారు ప్రవీణ్.
అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో స్థలం అమ్మేస్తానని వ్యాపారవేత్త బెదిరించడంతో, మీకు వేరే స్థలం చూపిస్తానని గత శనివారం విశ్వనాధంను మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు ప్రవీణ్, రజిత.
కారులో విశ్వనాధం కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి హత్య చేసి, అతని ఒంటి మీద ఉన్న 10 తులాల బంగారాన్ని లాక్కుని మృతదేహన్ని ఇమాంబాద్ వద్ద కాలువలో పడేసి హైదరాబాద్ వెళ్లి బంగారం విక్రయించారు దంపతులు. తన భర్త కనిపించడంలేదని విశ్వనాధం భార్య చేసిన ఫిర్యాదుతో మృతదేహన్ని గాలించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కానిస్టేబుల్ దంపతులను అరెస్ట్ చేశారు పోలీసులు. గత నెల 25వ తేదీన ప్రవీణ్, రజిత దంపతులు తమ ఇంటి వద్ద ఉండే వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తామని నమ్మించి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు.
