తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఆలస్యం చేయడాన్ని విశాల్ తప్పుబట్టారు.
విజయ్‌కు అవకాశం ఇవ్వకుండా గవర్నర్ కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను విశాల్ తన ట్వీట్లో ఉదహరించారు.2017-18 మధ్య కాలంలో గోవా, మణిపూర్, మేఘాలయ, మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అనిశ్చితి నెలకొన్నప్పుడు, అప్పటి గవర్నర్లు వెంటనే స్పందించిన తీరును విశాల్ గుర్తు చేశారు.
ఆయా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీలను ఆహ్వానించి, అసెంబ్లీలో ‘ఫ్లోర్ టెస్ట్’ (బల నిరూపణ) ద్వారా మెజారిటీని నిరూపించుకోవాలని ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదే ఫార్ములాను ఇప్పుడు తమిళనాడులో విజయ్ విషయంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే ప్రజల తీర్పుకు గౌరవం ఎక్కడ ఉంది? అంటూ విశాల్ నిలదీశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ సమీకరణాల పేరుతో కాలయాపన చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు.
ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, VCK మరియు CPI పార్టీలు విజయ్‌కు మద్దతు తెలపగా, ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి విశాల్ బహిరంగంగా మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై తమిళనాడు భవిష్యత్తు ఆధారపడి ఉన్న తరుణంలో, విశాల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
