ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. వచ్చే లోక్సభ ఎన్నికలే టార్గెట్గా ఇప్పటినుండే ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం, కొత్త వారికి(జెన్ జెడ్) ప్రాధాన్యం దిశగా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరు రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షులను మార్చేందుకు ఏఐసీసీ సరత్తు ముమ్మరం చేసింది.
ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆశించిన స్థాయిలో రాణించని రాష్ట్రాలతో పాటు నాయకత్వ మార్పు అవసరమున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సీనియర్ల అనుభవంతో పాటు క్షేత్రస్థాయిలో దూకుడుగా పనిచేసే యువ నేతలకు పీసీసీ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాజిక వర్గాల వారీగా ఓటు బ్యాంకును ఆకట్టుకునేలా కొత్త అధ్యక్షుల ఎంపిక జరగనుంది. కొన్ని రాష్ట్రాల్లో సీనియర్ల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి…అందరినీ ఏకతాటిపైకి తెచ్చే సమర్థులైన లీడర్ల కోసం అన్వేషణ సాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు బలపడటానికి ఎక్కువ అవకాశం ఉన్న రాష్ట్రాల జాబితాను అధిష్టానం సిద్ధం చేసింది. ముఖ్యంగా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో పాత కమిటీలను రద్దు చేసి, సరికొత్త కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నారు.
ఈ ప్రక్షాళన ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇవ్వవచ్చని కాంగ్రెస్ నమ్ముతోంది. ఈ నెలాఖరుకల్లా కొత్త పీసీసీ అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మార్పులు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసివస్తాయో వేచిచూడాలి.
